పదిలో ఉత్తమ ఫలితాల నమోదుకు కృషి చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యాభ్యాసానికి పునాదిగా నిలిచే పదవ తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్ధి చక్కగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిలో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి, అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్స్‌ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

మే 11 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో కలెక్టర్‌ శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లు, మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై వారికి మార్గనిర్దేశం చేశారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్ల నుండి విద్యా రంగం తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వచ్చిందని, ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ బడులను ఆలస్యంగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.

తాను జిల్లాలో బాధ్యతలు చేపట్టిన వెంటనే తనకు ఎంతో ఇష్టమైన విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని భావించినప్పటికీ, కరోనా ప్రభావం వల్ల విద్యా రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించే అవకాశం లభించలేదని అన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి పూర్వ వైభవం చేకూర్చేందుకు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా చూడాలని, అందుబాటులో ఉన్న సమయాన్ని, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌కు సూచించారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే ఎక్కువ శాతం చదువుతున్నందున, వారికి చక్కటి భవిష్యత్తును అందించాలనే సదాశయంతో ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్‌ ఉద్బోధించారు. పేద విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు వారికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధమని, దానిని సరిగా అందించకపోతే వారు జీవితాంతం పేదరికంలోనే మగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమయాన్ని ఏమాత్రం వృధా కానివ్వకుండా చక్కటి ప్రణాళికతో విద్యాబోధన జరిపిస్తూ మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. దీని వల్ల విద్యార్థులు జీవితాంతం గురువులను గుర్తుంచుకుంటారని, తాము విధులకు పూర్తి న్యాయం చేశామనే సంతృప్తి ఉపాధ్యాయులకు మిగులుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌ వారివారి విధులు సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోదని, తమ బాధ్యతను పూర్తిస్థాయిలో గుర్తెరిగి ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన అందుతోందా లేదా అన్నది నిశితంగా గమనించాలని అన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించని ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టే విషయంలో వెనుకంజ వేయవద్దని, విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్నందున నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారి పట్ల కఠిన నిర్ణయాలతో ముందుకెళ్లాలని సూచించారు.

అయితే, మెరుగైన మార్కులు, ర్యాంకులను పరమావధిగా భావిస్తూ అడ్డదారులు అవలంభించి జిల్లాకు చెడ్డ పేరు తేవద్దని కలెక్టర్‌ హితవు పలికారు. ర్యాంకుల కంటే విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేసేందుకు కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయని, దీనివల్ల విద్యార్థులు కూడా చదువులో తమ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందన్న నానుడికి వాస్తవరూపం కల్పిస్తూ, ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు.

వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున వచ్చే సోమవారం (ఈ నెల 7) నుండి అన్ని పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యేలా చూడాలని కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బోధన, ఉత్తమ ఫలితాల సాధన కోసం ఉపకరించే గైడ్లు, మెటీరియల్స్‌, నోటుబుక్స్‌ వంటి వాటి కోసం ప్రత్యేకంగా పది లక్షల రూపాయల నిధులు కేటాయిస్తానని కలెక్టర్‌ ఈ సందర్భంగా వెల్లడిరచారు. అంతేకాకుండా దాతలను సంప్రదించి వారూ కూడా తోడ్పాటును అందించేలా చొరవ చూపుతామని అన్నారు.

కాగా, మన – ఊరు మన బడి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించాలని, అవసరం ఉన్న పనులను మాత్రమే గుర్తించేలా చూడాలన్నారు. మరమ్మతులు, ఫర్నిచర్‌, నీటి వసతి, టాయిలెట్స్‌, డిజిటల్‌ తరగతుల నిర్వహణకు అవసరమైన సామాగ్రి వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌ వి. దుర్గాప్రసాద్‌, నర్రా రామారావు, మండల విద్యాధికారులు, ఆయా పాఠశాలల హెచ్‌ ఎంలు, కెజిబివి స్పెషల్‌ ఆఫీసర్లు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్స్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »