నిజామాబాద్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ మిగులు భూములను గుర్తిస్తూ, పూర్తి వివరాలతో నివేదికలు అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన ఆర్దీవోలు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల భవన నిర్మాణాల కోసం అవసరమైన మేర స్థలాలను కేటాయించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్‌లకు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూములను కేటాయించాల్సి ఉన్నందున, ప్రభుత్వ మిగులు భూములను గుర్తించడం ఆవశ్యకంగా మారిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆయా గ్రామాల మ్యాప్ లను నిశితంగా పరిశీలన జరుపుతూ, మిగులు భూములను గుర్తించాలని, ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తూ ప్రభుత్వ స్థలాలను మిగులు భూముల జాబితాలో చేర్చాలని అన్నారు. కాగా, విద్యార్థులు ఉపకార వేతనాలకు సంబంధించి కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉన్నందున వీటిని తక్షణమే జారీ చేసేందుకు చొరవ చూపాలని తహసీల్దార్లకు సూచించారు.
ధరణి పెండిరగ్ దరఖాస్తులను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా వెంటదివెంట పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వారం నాటికి పెండిరగ్ దరఖాస్తులు మిగలకుండా అన్నిటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని, జిల్లాను టాప్ టెన్‌లో నిలపాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్దీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఆయా మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ లోని రెవెన్యూ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.