లయన్స్‌ క్లబ్‌ సేవలు స్ఫూర్తిదాయకం

ఆర్మూర్‌, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ హితమే పరమావధిగా లయన్స్‌ క్లబ్‌ దేశ, విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి కొనియాడారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సేవా స్ఫూర్తి పేరిట ఆర్మూర్‌ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి మాట్లాడుతూ, సమాజం ద్వారా అన్ని విధాలుగా లబ్ది పొందుతున్న క్రమంలో, సమాజానికి తిరిగి తాము ఏదైనా మంచి చేయాలనే సదాశయంతో వందేళ్ల క్రితం మెల్విన్‌ జోన్స్‌ అంకురార్పణ చేసిన లయన్స్‌ క్లబ్‌ స్వచ్చంద సంస్థ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని గుర్తు చేశారు.

ఈ సంస్థలో 15 లక్షల మంది సభ్యులు కొనసాగుతుండగా, మన భారత దేశం నుండి అత్యధికంగా మూడు లక్షల మంది లయన్స్‌ క్లబ్‌లలో ప్రాతినిధ్యం కలిగి ఉన్నారని వివరించారు. ఇది సాధారణ విషయం కాదని, ఇంత పెద్ద మొత్తంలో సభ్యులు, శాఖలను కలిగి అలుపెరుగని రీతిలో సమాజ సేవను కొనసాగిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రధానంగా లయన్స్‌ క్లబ్‌ అంటేనే అంధులకు కంటి చూపును ప్రసాదించే సంస్థగా పేరుగాంచిందని అన్నారు. నిజామాబాద్‌, బోధన్‌ పట్టణాల్లోనూ లయన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రుల ద్వారా, కామారెడ్డిలో బ్లడ్‌ బ్యాంకు రూపంలో విజయవంతంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు.

అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం, మధుమేహం వ్యాధి నియంత్రణ, చిరుప్రాయంలోనే వస్తున్న క్యాన్సర్‌ మహమ్మారిని పారద్రోలేందుకు, యువతలో చైతన్యాన్ని పెంపొందించేందుకు, విపత్తులు సంభవించిన సమయాల్లో బాధితులను ఆదుకోవడంలో లయన్స్‌ క్లబ్‌ విశేషంగా చొరవ చూపుతూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోందని కమిషనర్‌ పార్థసారథి ప్రశంసించారు. ఎలాంటి పరిమితులు విధించుకోకుండా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవా కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయిలో చేపడుతోందని, ఇంత పెద్ద ఎత్తున నిర్వహణ కలిగి ఉన్నప్పటికీ లయన్స్‌ క్లబ్‌ స్వచ్చంద సంస్థ పై ఇంతవరకు ఎలాంటి అవినీతి మచ్చ లేదని, ఈ సంస్థ సమర్ధవంతమైన పనితీరుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

లయన్స్‌ విశిష్టత, సేవా తత్పరతను గుర్తిస్తూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు వంటి ప్రొఫెషనల్స్‌ సభ్యులుగా చేరి, సమాజ సేవకు చొరవ చూపుతున్నారని అన్నారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. యువతను భాగస్వాములు చేసేందుకు లియో క్లబ్‌లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

లియో క్లబ్‌లను ఎంతగా ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో అంత పెద్ద ఎత్తున యువ శక్తి ద్వారా ప్రజలకు సేవలండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. లయన్స్‌ ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులను కూడా కార్యక్రమాలలో భాగస్వాములు చేస్తే, వారిలోను సమాజ సేవా కార్యక్రమాల పట్ల స్ఫూర్తి నింపినట్లు అవుతుందన్నారు. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో సేవా భావం సన్నగిల్లుతూ, స్వార్థం పెచ్చుమీరుతోందని కమిషనర్‌ పార్థసారథి ఆవేదన వెలిబుచ్చారు. మార్కులు, ర్యాంకులే ప్రామాణికంగా విద్యా వ్యవస్థ రూపాంతరం చెందడమే దీనికి ప్రధాన కారణమని ఆయన ఆక్షేపించారు.

స్వార్థ చింతనను వీడి సమాజానికి తమ వంతుగా మనం ఎం చేస్తున్నాం అన్నది ఎవరికీ వారు ప్రశ్నించుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించి ధనవంతులుగా మారితే సమాజానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని, సేవా గుణాన్ని చాటుకున్నప్పుడే మన సంపాదనకు సార్థకత చేకూరుతుందని, సేవా కార్యక్రమాలతో ఎనలేని ఆత్మ సంతృప్తి లభిస్తుందని హితవు పలికారు. దేశ వ్యాప్తంగా 200 లయన్స్‌ నేత్ర వైద్యశాలలు ఉండగా, రాష్ట్రంలో 14 ఉన్నాయని, వీటిని మరింత ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ప్రజలకు కంటి సంబంధిత చికిత్సలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు.

తాను పుట్టి పెరిగిన ఆర్మూర్‌ పట్టణంలో లయన్స్‌ క్లబ్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఆర్మూర్‌ ఆర్దీవో శ్రీనివాస్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రాంతీయ చైర్మన్‌ సుధీర్‌ బాబు, మాజీ చైర్మన్‌ రఫీయుద్దీన్‌, ప్రతినిధులు బాబురావు, రమేష్‌, బసవేశ్వర రావు, వీ.టి.రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్‌ పామ్‌ నర్సరీ పరిశీలన

కాగా, ఆర్మూర్‌ పర్యటనకు హాజరైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలోని చేపూర్‌ శివారులో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రీ యూనిక్‌ కంపెనీ ప్రభుత్వ తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఆయిల్‌ పామ్‌ మొక్కల నర్సరీని పరిశీలించారు. మొక్కల పెంపకంలో పాటిస్తున్న మెళుకువలు, ప్రభుత్వం తరపున అందుతున్న ప్రోత్సాహకాలు గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, గత ఏడాది జూలై మాసంలో నర్సరీలో ఆయిల్‌ పామ్‌ మొక్కల పెంపకం ప్రారంభించారని, ఏడాది కాలం పాటు నర్సరీలో అభివ ృద్ధి చేసిన మొక్కలను ఈ ఏడాది జూన్‌ మాసంలో రైతులకు అందజేస్తారని తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటల స్థానంలో అధునాతన పంటలఫై అవగాహన పెంపొందించుకుని వాటిని సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ దిశగా ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని, రాష్ట్రంలో ఈసారి సుమారు రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయనున్నారని తెలిపారు.

ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టిన నాల్గవ సంవత్సరం నుండి దిగుబడులు రావడం ప్రారంభం అవుతుందని, ఎకరం విస్తీర్ణానికి కనీసం లక్ష రూపాయలకు పైబడి ఆదాయం పొందవచ్చని కమిషనర్‌ సూచించారు. సుదీర్ఘ కాలంపాటు కనీసం 40 సంవత్సరాలు ఆయిల్‌ పామ్‌ పంట ద్వారా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. పంటను విక్రయించుకునే విషయంలోనూ ఎలాంటి మార్కెటింగ్‌ ఒడిదుడుకులకు తావుండదని, ప్రభుత్వమే మద్దతు ధరను నిర్ణయిస్తూ నిర్దేశించిన కంపెనీలకు ఆయిల్‌ పామ్‌ పంట దిగుబడులను పంపించే వెసులుబాటు కల్పిస్తుందన్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగు కోసం వరితో పోలిస్తే తక్కువ మోతాదులోనే సాగు నీరు అవసరం పడుతుందని, అయితే ఏడాది పొడుగునా ఆయిల్‌ పామ్‌ మొక్కలకు నీటిని అందించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు నీటి సౌకర్యం కలిగి ఉన్న రైతులు ఆయిల్‌ పామ్‌ సాగును చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని కమిషనర్‌ హితవు పలికారు. కమిషనర్‌ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు దాస్‌, ఇతర అధికారులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »