నిజామాబాద్, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం ఉన్న పనులను మాత్రమే గుర్తించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మన ఊరు – మన బడి, హరితహారం, దళిత బంధు, ఉపాధి హామీ అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
ముందుగా ప్రభుత్వ బడుల స్థితిగతుల గురించి, చేపట్టాల్సి ఉన్న పనుల విషయమై మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యావశ్యకం అయితేనే అదనపు తరగతి గదుల నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రధానంగా నీటి వసతితో కూడిన టాయిలెట్స్ నిర్మాణాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి బడిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 40 మంది బాలురకు ఒకటి చొప్పున, బాలికలు 20 మందికి ఒకటి చొప్పున అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు వేర్వేరుగా ర్యాంపుతో కూడిన టాయిలెట్స్ నిర్మించాలని సూచించారు. తప్పనిసరిగా వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన స్టోరేజ్ ట్యాంక్, సంప్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటిని వినియోగించుకుంటూ, లేనిచోట కొత్తగా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుద్దీకరణ పనులను ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి కనీసం ఒక లీటరు చొప్పున తాగునీటి వసతి అందుబాటులో ఉండాలన్నారు.
ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలకు లోబడి బడులకు ఆకట్టుకునే రీతిలో రంగులు వేయించాలని సూచించారు. పాత ఫర్నీచర్ స్థానంలో అన్ని బడులకు అధునాతన ఫర్నీచర్ సమకూర్చనున్నారని తెలిపారు. నోడల్ అధికారులు పనుల ఖరారులో కీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నందున అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ఈ నెలాఖరుకు ముందే బిల్లులు సమర్పిస్తే సకాలంలో బిల్లులు మంజూరయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కూలీలకు కూడా ఉపాధి హామీ వేతనాలు నిర్ణీత గడువులోపు అందేందుకు వీలుగా ప్రతి పనికి సంబంధించి తప్పనిసరిగా మస్టర్లను రూపొందించాలని ఆదేశించారు. ఇంకను ఎక్కడైనా పనులు ప్రారంభం కానట్లయితే స్థానిక ప్రజాప్రతినిధులకు పరిస్థితిని వివరిస్తూ వెంటనే పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు.
కాగా, దళిత బంధు పథకం కింద లబ్ధిదారులతో వారు ఎంచుకునే యూనిట్లను గ్రౌండిరగ్ చేయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. యూనిట్ల స్థాపన పై లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. హరితహారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని, నాటిన ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం వేసవి ఎండలు అంతకంతకు పెరుగుతున్నందున, మొక్కలకు క్రమం తప్పకుండ నీరందేలా చూడాలన్నారు. మే నెలాఖరు వరకు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అవి పూర్తిగా సంరక్షించబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ సునీల్, డీసిపీ అరవింద్ బాబు, డీఈఓ దుర్గాప్రసాద్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్‌డీఓ చందర్, మెప్మా పీడీ రాములు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.