కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లివర్ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి వైద్య సహాయం నిమిత్తం ఆరోగ్యశ్రీ కార్డును ఆరోగ్యశ్రీ కలెక్టరేట్ అధికారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందజేశారు. జుక్కల్ మండలం పెద్ద ఏడిగి గ్రామానికి చెందిన దేవాడే నాగనాథ్ లివర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా వారికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని ఆరోగ్యశ్రీ శాఖ అధికారులను సంప్రదించారు.
ఈ విషయమై కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి డాక్టర్ వినీత్ కుమార్‌తో మాట్లాడి తక్షణమే ఆపరేషన్ నిమిత్తమై ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ అధికారులు ఆయనకు ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసి జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ లివర్ వ్యాధితో నాగనాథ్ బాధపడుతూ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, బాధితుడు వ్యవసాయ కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ కుటుంబ పోషణ సాగిస్తుండగా ఈ తరుణంలో లివర్ సమస్య తలెత్తడంతో చికిత్స కొరకు డబ్బు లేకపోవడంతో కలెక్టరేట్‌లోని ఆరోగ్యశ్రీ అధికారులకు సంప్రదించగా వారికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న తనకు జిల్లా జాయింట్ కలెక్టర్, ఆరోగ్యశ్రీ అధికారులకు కేవలం 30 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు అందజేసి ప్రాణాలు కాపాడిన వారికి బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆరోగ్యశ్రీ అధికారి అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.