నిజామాబాద్, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులు నిర్దేశిత లక్ష్యాలకు చేరుకుని ఇతర లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. యూనిట్ల స్థాపనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, కొంత ఆలస్యం అయినప్పటికీ పూర్తి అవగాహనతో యూనిట్లను ఏర్పాటు చేసుకుని కష్టపడితే మంచి లాభాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని హితవు పలికారు.
దళితబంధు కింద ఎంపికైన లబ్దిదారులను కలెక్టర్ బుధవారం స్వయంగా వారి ఇళ్ళకు వెళ్లి కలిసి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో గంగాధర్, రాజేందర్, గంగాధర్ అనే ముగ్గురు లబ్దిదారులను కలిసిన కలెక్టర్, యూనిట్ స్థాపన విషయమై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము ముగ్గురు కలిసి జేసీబీ తీసుకోదల్చుకున్నామని లబ్దిదారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అదే గ్రామంలో పుష్ప అనే మరో లబ్దిదారును కలెక్టర్ కలువగా, డోజర్ కోనుగోలు చేస్తామని తెలిపారు. వారికి కలెక్టర్ అభినందలు తెలుపుతూ, జిల్లా యంత్రాంగం తరపున పూర్తి మద్దతుగా నిలుస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయిస్తామని భరోసా కల్పించారు.
అనంతరం ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో నందిపేట, ఆర్మూర్, మాక్లూర్ మండలాల పరిధిలో దళితబంధు కింద ఎంపికైన లబ్దిదారులతో కలెక్టర్ భేటీ అయ్యి యూనిట్ల స్థాపనపై సమగ్రంగా అవగాహన కల్పించారు. దళిత కుటుంబాలు పేదరికం నుండి బయటపడి స్వశక్తితో ఎదగాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా లబ్ధిదారులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న యూనిట్లను ఏర్పాటు చేసుకుని వాటిని విజయవంతంగా నిర్వహిస్తూ లాభాలు సాధించినప్పుడే దళితబంధు పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు.
ఇంతపెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తున్న పథకం దేశంలోనే మరెక్కడా లేదని, ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులు బాగుచేసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. వ్యాపారంలో కేవలం పెట్టుబడి పెడితే సరిపోదని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు శ్రమను జోడిస్తేనే విజయవంతం అవుతారని సూచించిన కలెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరుభాయి అంబానీ వ్యాపార దక్షత గురించి ఈ సందర్భంగా ఉదహరించారు.
ప్రస్తుతం తొలి విడతలో ఒక్కో నియోజకవర్గం నుండి దళితబంధు కింద వంద మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేశామని, దశలవారీగా ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అమలు చేస్తామని, చివరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే దళిత కుటుంబాలు కూడా అర్హులేనని కలెక్టర్ వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తొలి విడతలో ఎంపికైన వారు పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకుని, యూనిట్లను విజయవంతంగా నిర్వహించి మలివిడతలో ఎంపికయ్యే లబ్దిదారులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అందిస్తున్న పది లక్షల రూపాయలలో పది వేల రూపాయలను నియోజకవర్గ స్థాయిలో రక్షణ నిధి కింద జమ చేయడం జరుగుతుందని వివరించారు. మిగతా 9.90 లక్షల రూపాయలను యూనిట్ల స్థాపన కోసం పూర్తిగా లబ్దిదారులకే అందిస్తామని అన్నారు. బ్యాంకు గ్యారంటీ, కాన్సెన్ట్ వంటివి ఏవీ అవసరం లేకుండా ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందిస్తోందన్నారు. ఇప్పటికే జిల్లాకు నిధులు మంజూరు అయ్యి సిద్ధంగా ఉన్నాయని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదని, ఈ నెలాఖరు వరకు యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎటొచ్చీ తొందరపాటు నిర్ణయాలతో యూనిట్లను పెట్టి ఇబ్బందులు పడవద్దన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. యూనిట్ల ఎంపిక, వాటి స్థాపన విషయంలో లబ్ధిదారులు కోరితే ప్రభుత్వం తరపున శిక్షణ ఇప్పిస్తామని, వారు కోరుకునే యూనిట్లలో సాధకబాధకాలపై పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఉందని, యూనిట్లను ఏ ప్రాంతంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట డీపీవో జయసుధ, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో గోపిబాబు తదితరులు ఉన్నారు.