నిజామాబాద్, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాల్లో భాగంగా నాగారంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో మహిళలకు ఆరోగ్య, న్యాయ,రక్షణ విషయాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ మహిళా న్యాయవాది కవిత రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ వ్యక్తిగత జీవితం పట్ల శ్రద్ధ వహించాలని అదేవిధంగా ఉన్నతమైన చదువులు చదవడం తమ హక్కుగా భావించాలని సూచించారు. మహిళల పట్ల భౌతికంగా, మానసికంగా ఎలాంటి చిన్న హింసకు గురైనా వెంటనే న్యాయ సలహా కోసం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, మహిళల కోసమే ప్రత్యేకంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలని కోరారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల స్త్రీ వైద్య నిపుణురాలు ఇందు మాట్లాడుతూ మహిళలు తమ వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తమ నెలసరి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని సూచించారు. మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దన్నారు.
కార్యకమానికి అధ్యక్షత వహించిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అంటే ఒక్క రోజుతో ముగించే తంతు కాదని సమానత్వం కోసం ఎప్పటికీ మనం శ్రమిస్తూనే ఉండాలని సూచించారు. నెహ్రూ యువ కేంద్ర మహిళలల్లో చైతన్యం కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జైనా, వైస్ ప్రిన్సిపాల్ భార్గవి ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.