ఈ-నామినేషన్‌ నమోదు ప్రక్రియ సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల భవిష్య నిధి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ-నామినేషన్‌ నమోదు ప్రక్రియను ప్రైవేట్‌ సంస్థల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు ఈ-నామినేషన్‌ నమోదు కోసం గురువారం సాయంత్రం నాగారం శివారులోని దేశాయి బీడీ కంపెనీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎఫ్‌ సౌకర్యం కలిగిఉన్న కార్మికులు, ఉద్యోగులకు ఈ-నామినేషన్‌ నమోదు ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని, వారి కుటుంబ సభ్యులకు భద్రతతో కూడిన భరోసాను అందిస్తుందని అన్నారు. కార్మికులు, ఉద్యోగులు పదవీ విరమణ పొందే సమయంలో ఒక్క రూపాయిని కూడా నష్టపోకుండా పూర్తి స్థాయిలో భవిష్య నిధిలో దాచుకున్న డబ్బులు పొందవచ్చని, ఇది వారి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా అనుకోని రీతిలో ప్రమాదాలకు గురైనా, అనారోగ్యంతో అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి బీమా సదుపాయం వర్తిస్తుందని అన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులు ఓ వైపు వ్యవసాయ పనులు చేస్తూనే, మరోవైపు తమ ఇళ్లల్లో బీడీలు చుడుతారని, అలాంటి వారందరు ఈ-నామినేషన్‌ నమోదు చేసుకుని తాము పొందుతున్న వేతనం నుండి పది శాతం మొత్తాన్ని భవిష్య నిధి కింద జమ చేయాలని సూచించారు.

కార్మికులు, ఉద్యోగుల వాటాకు సమానంగా యాజమాన్యాలు కూడా మరో పది శాతం మొత్తాన్ని జమ చేస్తాయని, ఉద్యోగ విరమణ సమయంలో కార్మికులకు ఈ మొత్తాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కార్మికులు, ఉద్యోగులు 58 సంవత్సరాలు దాటిన మీదట ప్రతీ నెల పెన్షన్‌ సదుపాయం పొందవచ్చని సూచించారు.

ప్రైవేట్‌ రంగంలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులందరూ ఈ-నామినేషన్‌ నమోదు చేసుకునేలా జిల్లా యంత్రంగం ఆధ్వర్యంలోనూ కృషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు అవగాహన కల్పిస్తూ వారిచే పెద్ద ఎత్తున ఈ-నామినేషన్‌ నమోదు జరిపించిన ఈపీఎఫ్‌ కార్యాలయ ఉద్యోగులకు, ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులకు నగదు పారితోషికాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.

కార్యక్రమంలో కేంద్ర భవిష్యనిధి అదనపు కమిషనర్‌ వైశాలి దయాల్‌, నిజామాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం కమిషనర్‌ సుశాంత కె.పధి, బీడీ యజమానులు సంఘం కార్యదర్శి ధర్మేంద్రగాంధీ, సీనియర్‌ మేనేజర్‌ ఉమేష్‌ వి.పటేల్‌, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »