నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల ఖరారు

నిజామాబాద్‌, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ఈ నెలాఖరులోగా వారు ఎంచుకున్న యూనిట్లను అధికారికంగా కేటాయిస్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఖరారైన యూనిట్లను ఏప్రిల్‌ మొదటి వారం నుండి స్థాపించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

కలెక్టర్‌ శుక్రవారం డిచ్‌పల్లి మండలం సాంపల్లి గ్రామంలో దళితబంధు కింద లబ్దిదారులుగా ఎంపికైన గుండారం బోజవ్వ, రాజవ్వ, పల్లె నిహారిక, నాందేడ్‌ పద్మల ఇళ్ళకు వెళ్లి దళిత బంధు ప్రాముఖ్యతను, దీనిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపై అవగాహన కల్పించారు. అనంతరం నడిపల్లి గ్రామంలోని రైతు వేదిక భవనంలో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని దళిత బంధు లబ్దిదారులతో కలెక్టర్‌ ముఖాముఖి జరిపారు.

అత్యధిక మంది ట్రాక్టర్‌లు, కార్లు యూనిట్ల కింద ఎంపిక చేసుకోగా, ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ వారికి హితవు పలికారు. సొంతంగా వాహనాలు నిర్వహించుకుంటే లాభాలు వస్తాయని, అలా కాకుండా ఇతరులకు వాహనాల నిర్వహణను అప్పగిస్తే నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా ఒకేసారి అందరూ వాహనాలను సమకూర్చుకుంటే గిరాకీలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న వ్యాపారాలను ఎంచుకోవాలని హితవు పలికారు.

ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా గ్రాంట్‌ రూపేణా పెద్ద మొత్తంలో అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తమ సొంత డబ్బులుగా భావిస్తూ, ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఎంతో జాగ్రత్తగా వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. దళిత బంధు రూపంలో వరించిన అదృష్టలక్ష్మిని అట్టిపెట్టుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ఆకాంక్షించారు.

ఈ పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయం మొత్తాన్ని పూర్తిగా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, ఒక్క రూపాయి కూడా వెనక్కి మళ్ళిపోదని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు లోనుకావద్దని కలెక్టర్‌ భరోసా కల్పించారు. యూనిట్ల ఎంపిక కీలకమైనందున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలను కొనితెచ్చుకోవద్దని సూచించారు. కుటుంబ భవిష్యత్తును నిర్దేశించే అతి ముఖ్యమైన నిర్ణయం అయినందున పూర్తి అవగాహనతో యూనిట్ల స్థాపనకై ఆచితూచి ముందుకెళ్లాలని కలెక్టర్‌ లబ్ధిదారులకు హితవు పలికారు.

లబ్ధిదారులు కోరిన పక్షంలో ఆయా రంగాల్లో ప్రభుత్వ పరంగా వారికి తగిన శిక్షణ ఇప్పించి, జిల్లా యంత్రాంగం తరపున పూర్తి మద్దతుగా నిలుస్తామన్నారు. ఇతరులను అనుకరిస్తూ మూస ధోరణిలో వెళ్లకుండా, మార్కెట్లో మంచి డిమాండ్‌ పలుకుతున్న పౌల్ట్రీ, కూరగాయల సాగు, డెయిరీ వంటి వ్యాపారాలను ఎంచుకుని స్వయంగా నిర్వహిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రంగాలను, వినూత్నమైన ఆలోచనలతో మార్కెట్‌ అవసరాలకు అనుగుణమైన వ్యాపారాలను పెడితే అనతికాలంలోనే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు.

ఇవి కేవలం తాము చేస్తున్న సూచనలు మాత్రమేనని, యూనిట్ల ఎంపికలో పూర్తిగా లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపార రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఏ రంగం అయినప్పటికీ కష్టపడే తత్వంతో ముందుకెళ్తే ఆశించిన విజయాలను సొంతం చేసుకోగలుగుతారని పేర్కొన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా సదాశయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం విజయవంతం అయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువత లబ్ధిదారులకు తగిన సలహాలు సూచనలు అందిస్తూ, వారిని సరైన దిశగా ప్రోత్సహించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కలెక్టర్‌ వెంట నిజామాబాద్‌ ఆర్డీవో రవి, డిచ్‌ పల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీడీఓలు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »