ఆర్మూర్, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిలన్ గార్డెన్‌లో ‘‘జానపద సంబరాలు’’ అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చౌకె లింగం, ప్రధాన కార్యదర్శి మైదం మహేష్, కోశాధికారి జింధం నరహరి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.
అణగారిపోతున్న కళలను సజీవంగా ఉంచడానికి అనేక మంది కళాకారులు తరలివచ్చి దాసరి భాగవతం శ్రీ కృష్ణ తులాభారం, చెంచులక్ష్మి యక్షగానం, చౌకె శివేశ్వర్ శివతాండవం, మ్యాజిక్ షో చందన్ శ్రీనివాస్ ఫిజికల్ డైరక్టర్, చౌకె లింగం బుర్రకథ, ఆలూర్, కేశ్‌పల్లి, సిద్దాపూర్ భజన కళా బృందాలతో భజన పాటల ప్రదర్శనలతో కార్యక్రమాల్ని ప్రదర్శించి, అందరి అభినందనలు, ప్రశంసలు పొందారు.
ఒక్కొక్క కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆ కార్యక్రమ నిర్వాహకులను శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. దాతల సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాతగా బ్రిజ్జు దత్తాద్రి, ఆర్థిక దాతలుగా సహకరించిన వేముల రమేష్, జక్కుల చంద్రశేఖర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుంచు లింగన్న, కోశాధికారి మ్యాకల నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజయ్య, ఆర్మూర్ అధ్యక్షులు మంచిర్యాల ప్రభాకర్, చింత దేవిదాస్, చౌకె ప్రసాద్, చౌకె వివేక్, చౌకె శ్రావణ్, గైని సదాశివ్ టీచర్ తదితరులు పాల్గొన్నారు.
జానపద కళాకారుల పక్షాన మూడు సమస్యలపై తీర్మానాలు చేసి, రాష్ట్ర శాఖకు అందజేశారు. అందులో ప్రతి కళాకారునికి వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పెన్షన్లకు అర్హత కల్పించి, పెన్షన్లు మంజూరు చేయాలని తీర్మానించారు. అలాగే ప్రతీ గ్రామంలో నిర్మించబోయే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కళాకారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవాలని తీర్మానించారు.
అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందు మాదిరిగా కళాకారుల బందు అనే నూతన పతాకాన్ని ఆవిష్కరించి ఒక్కొక్క కళాకారునికి పదిలక్షల రూపాయలు ఇప్పించాలని రాష్ట్ర శాఖకు తీర్మానాల ప్రతులను సమర్పించారు. కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.