డిచ్‌పల్లి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అఫ్లైడ్ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహింపబడిన ‘‘తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఆరవ వార్షిక సదస్సు’’ ఆదివారం సాయంత్రం ముగిసింది.
సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెస్ డైరెక్టర్ ఆచార్య ఇ. రేవతి హాజరై మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు విశ్వవిద్యాలయాలు, వందకు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సామాజిక ఆర్థిక సంస్థలు ప్రామాణికమైన పరిశోధనలను వెలువరించాలని సూచించారు. దీని ద్వారానే రాష్ట్రంలో మౌలిక ఆర్థిక వనరులు కల్పించడం సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగ సంక్షోభానికి గల కారణాలను పరిష్కరించి నివారణోపాయాలను అన్వేషించాలన్నారు.
సాధారణంగా రాష్ట్రాభివృద్ధి అంటే పారిశ్రామిక రంగ అభివృద్ధితోనే మిళితమై ఉంటుందంన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనలు చేసి, నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. పరిశోధన పత్రాలు, సిద్ధాంత గ్రంథాలు రాసే విధానాలను తెలుసుకోవాలన్నారు. ప్రసిద్ధ ఆధార గ్రంథాలు, ప్రముఖ జర్నల్స్, విశిష్టమైన ఆర్టికల్స్ చదవాలని సూచించారు. తద్వారా పరిశోధనా సామర్థ్యం పెరుగుతుందనారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రంథంలోని విషయ చౌర్యానికి పాల్పడకూడదని ఆమె హెచ్చరించారు.
ఇలా ఎన్ని పుస్తకాలు ప్రచురించినా పరిశోధన మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని విచారం వ్యక్తం చేశారు. అందుకే పారదర్శకమైన పరిశోధనలు వెలువరించవలసిన బాధ్యత ప్రతి అకడమిక్ విద్యార్థి పైన ఉందని వ్యాఖ్యానించారు. కోవిద్ – 19 కాలాన్ని అధిగమించడానికి ఆర్థిక శాస్త్రంలో మేలుతరమైన పరిశోధనలు ఆర్థిక పరిష్కార దిశలో జరుగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఎల్లప్పుడు సహకారం అందిస్తుందన్నారు.
ఈ వార్షిక సదస్సు ప్రధానంగా సంప్రదాయ రాజకీయార్థిక శాస్త్రం, ప్రపంచ పట్టణీకరణ ప్రభావం, ఆదాయ ఆర్థిక అసమానతలు అనే అంశాలపై సాంకేతిక విభాగాలను నిర్వహించామన్నారు. ఆదాయ ఆర్థిక అసమానతలు కలుగడానికి ప్రధాన కారణం సంపదంతా ఒకే వర్గం చేతిలో కేంద్రీక ృతం కావడమన్నారు. ఒక వైపు రియల్ ఎస్టేట్, ఐటి రంగం, షేర్ మర్కెట్, కమర్షియల్ ల్యాండ్, సెజ్‌ల రూపకల్పన వంటివి పెరిగిపోతున్నా, ఆర్థిక అసమానతలు మాత్రం తగ్గడం లేదన్నారు.
ఇది పూర్తి విద్యా, ఆరోగ్యాల మీద అత్యంత ప్రభావాన్ని చూపుతుందన్నారు. మహిళలు, పిల్లల విద్యా ఆరోగ్యాల మీద పూర్తి శ్రద్ధను కనబరుస్తూ ఆర్థిక విధానాలను రూపొందించవలసిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న నాలుగు దేశాలను ప్రమాణంగా తీసుకొని ఆయా దేశాల్లోని ఆదాయ స్థితిగతులను విశ్లేషించారు.
సమావేశానికి సభాధ్యక్షులుగా కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల పూర్వ ఉపకులపతి, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఆచార్య ఎన్. లింగమూర్తి వ్యవహరించారు. సెక్రటరీ ఆచార్య బి. శివారెడ్డి అసోసియేషన్ సదస్సు నివేదిక సమర్పించారు. ఉపాధ్యక్షులు ఆచార్య కె. ముత్యం రెడ్డి, ఆచార్య ఆర్. వి. రమణ మూర్తి, ఎకనామిక్స్ విభాగాధిపతి టి. సంపత్, బిఒఎస్ డా. ఎ. పున్నయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, పాలకమండలి సభ్యులు డా. కె. రవీందర్ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. పాత నాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా. బబ్బూరు వెంకటేశ్వర్లు, డా. ఎన్. స్వప్న ప్రసంగించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (కాంట్రాక్ట్) డా. శ్రీనివాస్, డా. దత్తహరి, వివిధ విశ్వవిద్యాలయాల ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు, వివిధ సంస్థల ఆర్థిక శాస్త్ర వేత్తలు, విషయ నిపుణులు, విశ్లేషకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో రెండవ రోజు ఉదయం మూడవ సాంకేతిక సమావేశం ‘‘ఆదాయ ఆర్థిక అసమానతలు’’ అనే అంశంపై జరిగింది. ఇందులో దాదాపు 20 పత్రాలు సమర్పింపబడ్డాయి. దీనికి అధ్యక్షులుగా ఆచార్య ఇ. రేవతి, కో- చైర్మన్‌గా డా. కె. రవీందర్ రెడ్డి, సెషన్ ఆర్గనైజర్‌గా ఆచార్య ఎ. అమరేందర్ రెడ్డి, రా-పోర్చర్‌గా డా. ఎన్. స్వప్న వ్యవహరించారు. తదనంతరం ‘‘తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్’’ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.