నిజామాబాద్, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు వీలుగా ప్రభుత్వం కొనసాగిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నాటికి ఒక్కో అధికారి కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన పనుల అంచనాలను రూపొందించి సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు.
సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ప్రతి పాఠశాలలోను నిర్వహణ కమిటీలు చురుకుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, స్థానిక సర్పంచ్, ఇంజనీరింగ్ విభాగం ఏ.ఈలకు జాయింట్ చెక్ పవర్‌తో కూడిన అకౌంట్‌ను, పూర్వ విద్యార్థులతో కూడిన మరో బ్యాంకు అక్కౌంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం సాయంత్రం నాటికి అన్ని పాఠశాలల్లో తీయాలని గడువు విధించారు.
అకౌంట్ తెరిచే విషయంలో ఏవైనా సమస్యలుంటే తోడ్పాటును అందించాలని లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌కు సూచించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో చేపట్టే టాయిలెట్స్, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్ల నిర్మాణాలను ఉపాధి హామీ పథకం కింద అంచనాలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఆయా బడులకు అవసరమైన ఫర్నిచర్‌ను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. మిగతా పనులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే ఎస్టిమేషన్‌లు తయారు చేసి నివేదికలు అందించాలని, నోడల్ అధికారులు ఈ మేరకు చొరవ చూపాలన్నారు.
కాగా, ఆయా పనుల ఎస్టిమేషన్‌లు చేపట్టే సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకోనాలని అన్నారు. అనవసర హంగు ఆర్భాటాలకు తావివ్వకూడదని, పదికాలాల పాటు విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచేలా నాణ్యతతో కూడిన పనులు జరిపించాలని హితవు పలికారు. ప్రభుత్వం పేర్కొన్న 12 రకాల పనులను చేపట్టాల్సి ఉందని, వీటిలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు తుది ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.