నిజామాబాద్, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ పధకానికి సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు మంజూరై సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్ మొదటి వారం నుండి యూనిట్ల స్థాపన కోసం లబ్దిదారులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.
కలెక్టర్ మంగళవారం బోధన్ శాసనసభా నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో దళిత బంధు లబ్దిదారులుగా ఎంపికైన సురేష్, మమత, ముత్తన్న ల ఇళ్ళకు వెళ్లి వారితో భేటీ అయ్యారు. ఎంచుకున్న యూనిట్లు ఏమిటీ, వాటి నిర్వహణలో ఏమైనా అనుభవం ఉందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్లు, ట్రాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉండి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ స్ప్రేయర్ వంటి యూనిట్లను ఎంచుకుంటే అధిక లాభాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు.
వంద మంది వరకు లబ్ధిదారులు డ్రోన్ స్ప్రేయర్ యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి మద్దతుగా నిలుస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. అవసరమైతే సంబంధిత కంపెనీతో మాట్లాడి జిల్లాలో సర్వీస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయిస్తామని, లబ్ధిదారులకు డ్రోన్ స్ప్రేయర్‌ల నిర్వహణపై శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం కూడా డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. అర్థమయ్యే రీతిలో కలెక్టర్ చేసిన సూచనలకు స్పూర్తి పొందిన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన వై.రాజేశ్వర్ అనే లబ్ధిదారుడు తాను ఇదివరకు ఎంపిక చేసుకున్న ఎర్టీగా కారు స్థానంలో డ్రోన్ స్ప్రేయర్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్ధత తెలుపడంతో కలెక్టర్ అతనిని అభినందించారు.
అనంతరం ఎడపల్లిలోని రైతు వేదిక భవనంలో బోధన్ నియోజకవర్గ దళిత బంధు లబ్దిదారులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా వచ్చిన పథకాలకు, దళిత బంధు పథకానికి ఎంతో తేడా ఉందన్నారు. ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా గ్రాంట్ రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తున్న గొప్ప పథకం దళితబంధు అని కొనియాడారు. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి దశల వారీగా లబ్ధి చేకూర్చబడుతుందని అన్నారు.
దళిత బంధు కింద మంజూరైన నిధులలో ఒక్క రూపాయి కూడా తిరిగి వెనక్కి వెళ్లదని, అవి పూర్తిగా లబ్ధిదారులకే చెందుతాయని స్పష్టం చేశారు. తిరిగి చెల్లించే అవసరం లేకుండా పెట్టుబడి రూపంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఆదాయం అందించే మార్గంలోనే వెచ్చించాలని హితవు పలికారు. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోయే అవకాశం ఉన్నందున పూర్తి అవగాహన ఏర్పరచుకున్న తర్వాతనే యూనిట్ల స్థాపనకు అడుగు ముందుకు వేయాలని హితవు పలికారు. ఏ వ్యాపార రంగంలోనైనా ఎంతగా కష్టపడితే అంతగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని, లేని పక్షంలో నష్టాలు మిగులుతాయని పేర్కొన్న కలెక్టర్, పలువురు వ్యాపారవేత్తల ఉదంతాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంకితభావం, పోటీ తత్వంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలను పొందగలుగుతామని పేర్కొన్నారు. శ్రమను ఆయుధంగా మలచుకొని, ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. లబ్ధిదారులు తాము స్థాపించే యూనిట్లను స్వయంగా నిర్వహించుకోవాలని, ఇతరులకు అప్పగిస్తే ఆశించిన లాభాలు రావని సూచించారు.
దళిత బంధు పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించిందని, రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత లబ్ధిదారులు మార్కెట్ అవసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, డిమాండ్ కలిగిన యూనిట్లను స్థాపించుకుని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు ఉన్నారు.