దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ

నిజామాబాద్‌, మార్చ్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు యూనిట్ల ఎంపికతో పాటు వాటిని తమకు నచ్చిన చోట స్థాపించుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారులకు ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆంక్షలు, పరిమితులు ఉండవన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులతో బుధవారం స్థానిక ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మార్గనిర్దేశం చేశారు.

లబ్ధిదారులు ఇప్పటికే ఏదైనా వ్యాపారంలో కొనసాగుతున్నట్లయితే, దళితబంధు కింద అందించిన ఆర్ధిక సహాయంతో దానిని మరింతగా విస్తరించుకునే వెసులుబాటు సైతం ఉందని కలెక్టర్‌ సూచించారు. ఎటొచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సరైన నిర్ణయంతో, పరిపూర్ణమైన అవగాహనతో సద్వినియోగం చేసుకుని దళిత కుటుంబాలు ఆర్ధిక అభ్యున్నతి సాధించాలన్నదే దళితబంధు పథకం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఎలాంటి పూచికత్తు, బ్యాంకు కాన్సేంట్‌ వంటి ఇబ్బందులు లేకుండా, నయా పైసా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం గ్రాంట్‌ రూపంలో పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తోందని, ఇలాంటి పథకం భూతద్దం పెట్టి వెతికినా బహుశా దేశంలోనే ఇంకెక్కడా ఉండదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ముమ్మాటికీ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని కలెక్టర్‌ గట్టి నమ్మకాన్ని వ్యక్తపర్చారు. దళిత బంధు రూపంలో అదృష్ట దేవత తలుపు తట్టినందున లబ్ధిదారులు ఈ సువర్ణావకాశాన్ని జార విడుచుకోకుండా తమ కుటుంబ స్థితిగతులను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. ఎంచుకున్న వ్యాపారాన్ని లబ్ధిదారులు స్వయంగా నిర్వహిస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చని, ఇతరులను నమ్ముకుని వారికి వ్యాపార నిర్వహణను అప్పగిస్తే అది మునిగిపోయే నౌకలా మారే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయపడ్డారు.

కొత్తగా నెలకొల్పే వ్యాపారాల్లో మొదటి నాలుగైదు సవంత్సరాల కాలం ఎంతో కీలకమైనందున సొంతంగా వ్యాపారాలు చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడికి మీ శ్రమను జోడిస్తూ కసితో పనిచేస్తే తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగల్గుతారని కలెక్టర్‌ సూచించారు. సైకిల్‌పై కిరోసిన్‌ అమ్మిన ధీరుభాయి అంబానీ కుటుంబ ఆస్తులు ప్రస్తుతం ఐదు లక్షల కోట్ల పైచిలుకు విలువకు చేరుకున్నాయని, అదేవిధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ తరహాలో వేల కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుందని అన్నారు.

విజయం సాధించేందుకు అడ్డదారులు ఉండవని, కష్టాన్ని నమ్ముకుంటే దాని వెనుకాలే విజయం పరిగెడుతూ వస్తుందన్నారు. స్థాపించుకున్న వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేసుకోవాలన్నదే ఆశ, శ్వాసగా మల్చుకుని గట్టి సంకల్పంతో ముందుకెళ్లాలని లబ్ధిదారులకు కార్యోన్ముఖులు చేశారు. తొలి దశలో ప్రస్తుతం జిల్లాలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, అందులో 340 పైచిలుకు మంది వాహనాల యూనిట్లను ఎంపిక చేసుకున్నారని, దీనివల్ల వాహనాల వినియోగానికి డిమాండ్‌ సన్నగిల్లే అవకాశం ఉందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు యూనిట్ల ఎంపిక విషయమై పునరాలోచన చేసుకోవాలని, ఇప్పటికి కూడా అధిక ఆదాయాన్ని అందించే ఇతర యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో డెయిరీ, పౌల్ట్రీ, ఇటుకల తయారీ, సెంట్రింగ్‌, సానిటరీ షాప్స్‌ వంటి వాటికి మంచి డిమాండ్‌ ఉందన్నారు. అయితే ఇది కేవలం తమ సలహా మాత్రమేనని, లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లను స్థాపించుకునే స్వేచ్ఛ వారికే ఉందని, ఈ విషయంలో అధికారులు ఎవరు ఒత్తిడి చేయబోరని స్పష్టం చేశారు.

లబ్ధిదారులు కోరితే వారికి ఇష్టమైన వ్యాపారం రంగంలో పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ కూడా ఇప్పిస్తామని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, దళిత బంధు పథకం ఉద్దేశ్యాన్ని నీరుగార్చవద్దని, పూర్తి అవగాహనతో ఎంచుకున్న వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ, మలివిడతలో ఎంపిక కానున్న లబ్ధిదారులకు ఆదర్శంగా నిలువాలని కలెక్టర్‌ కోరారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో యూనిట్ల స్థాపనకు శ్రీకారం చుట్టనున్నందున, నెలకొల్పబోయే వ్యాపారం పై సమగ్ర అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ముఖాముఖి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, నిజామాబాదు ఆర్డీవో రవి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, మెప్మా పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »