కామారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హోలీ వేడుకలు జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఉద్యోగ జేఏసీ, టిఎన్‌జిఓఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఉద్యోగులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు మర్యాదపూర్వకంగా కలిసి పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జాతీయ రహదారిపై స్పీడ్ గనులను పోలీస్ శాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా జరిగిన అభివృద్ధి పనులను తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో క్రమక్రమంగా నేరాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు జిల్లాకు రావడం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 2900 మంది నేరస్తులను గుర్తించి, తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. జిల్లా అధికారులు ఈ సందర్భంగా తమ అనుభవాలను వివరించారు.
హోలీ వేడుకల్లో జిల్లా అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజారామ్, జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ దేవేందర్, టిఎన్‌జిఓఎస్ ప్రధాన కార్యదర్శి సాయిలు, టిజిఓఎస్ ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి రఘు కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా ఉద్యానవన అధికారి సంజీవ రావు, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, టిఎన్‌జివోఎస్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, జుగల్ కిషోర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.