నిజామాబాద్, మార్చ్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌లను భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.
కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే 4 కార్మిక వ్యతిరేక కోడ్లు తీసుకొచ్చిందన్నారు. ఈ కార్మిక వ్యతిరేక 4 కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేయాలన్నారు.
కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానన్న కెసిఆర్ హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు అందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను, కార్మికులను దోచుకోవడంలో మోడీ, కేసీఆర్‌లు పోటీపడుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర నాయకులు నరేందర్, వెంకన్న, సుధాకర్, సాయాగౌడ్, విఠల్, కిరణ్, చరణ్ పాల్గొన్నారు.