కామారెడ్డి, మార్చ్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువత ఇష్టపడి నైపుణ్యాలను నేర్చుకొని భవిష్యత్తులో మాస్టర్ టైనర్లుగా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ఫోన్ రిపేరింగ్, హోటల్ మేనేజ్మెంట్, సోలార్ ద్వారా విద్యుత్ తయారీ, కంప్యూటర్, టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, బ్యూటీ పార్లర్, కూరగాయల నర్సరీ వంటి వాటి శిక్షణలో నైపుణ్యాలను పెంచుకొని రాణించాలని సూచించారు. ఆర్థికంగా సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పని పూర్తి చేసిన వారికి ఈ శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. శిక్షణలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడారు. యువత వారికి నచ్చిన ఉపాధి శిక్షణ పొంది, ఉద్యోగాలు సాధించి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. జీవితంలో రాణించి ఆర్థికంగా ఎదగాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ డిఆర్‌డిఓ మురళి కృష్ణ, ఉపాధి హామీ ఏపీడి శ్రీకాంత్, డీపీఎంలు, ఏపీఎంలు, యువత పాల్గొన్నారు.