నిజామాబాద్, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, ప్రజావాణి అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ వాటిని సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేయాలని సూచించారు.
కాగా, ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మన ఊరు – మన బడి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టాల్సి ఉన్న పనులకు సంబంధించిన అంచనా వ్యయం నివేదికలను తక్షణమే సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి మండలం నుండి కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన పూర్తి స్థాయి ఎస్టిమేషన్ రిపోర్ట్‌లను ఇప్పటికే అందించాల్సి ఉండేదన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం సాయంత్రం నాటికి పంచాయతీరాజ్ ఏ.ఈలు రెండు స్కూళ్ల అంచనా వ్యయం నివేదికలు అందించాలని, మిగితా మండలాల బాధ్యతలు అప్పగించబడిన ఏ.ఈలు నాలుగు పాఠశాలల్లో పనుల అంచనాలు రూపొందించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
అంచనాలను పక్కాగా రూపొందించాలని, మండల నోడల్ అధికారులు వాటిని సమగ్రంగా పరిశీలించిన తరువాతనే జిల్లా విద్య శాఖకు అందించాలని సూచించారు. అంచనా నివేదికలు అందిన వెంటనే అవి నిబంధనలకు లోబడి ఉంటే తక్షణమే పనులకు మంజూరీలు ఇస్తామన్నారు. బడులలో అవసరమైన పనులను మాత్రమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, తక్కువ నిధులతో ఎక్కువ పనులు జరిపించాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రధానంగా ప్రతి పాఠశాలోను డ్రైనేజీ వ్యవస్థ చక్కగా ఉండాలని, మురుగు జలాలు, వర్షపు నీరు నిలువ ఉండకుండా పకడ్బందీగా పనులు జరిపించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.