డిచ్‌పల్లి, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ఉదయం నిజామాబాద్‌లో గల జిల్లా కారాగార గృహాన్ని సందర్శించారు. న్యాయ విద్యలో భాగంగా ఈ పర్యటన చేశారు. జైలు ఆవరణలో అధికారులు టీయూ అధ్యాపకులతో, విద్యార్థులతో అభిజ్ఞ ప్రవర్తనా నైపుణ్యాల అభివృద్ధి ప్రోగ్రాం (ఉన్నతి) నిర్వహించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ జైలు నిజామాబాద్ సూపరింటెండెంట్ జి. ప్రమోద్, ఎస్. రాజశేఖర్ రెడ్డి జైలర్ డిప్యూటీ జైలర్ వి. సాయి కుమార్, మెడికల్ ఆఫీసర్ టి. శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు జైలు గదులను, పరిసర ప్రదేశాలను, వారి శిక్షలను, శిక్షల పరిమిత కాలం, వారికి గల ఉపాధి అవకాశాలను, విద్యాభ్యసనం, జైలులో జరిగిన వివిధ అవగాహనా కార్యక్రమాలను, జాతీయ పండుగల సందరభంగా ప్రముఖుల ఉపన్యాస వేదికలను గూర్చి తెలిపారు. ఖైదీల్లో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుమన్నారు.
జైలులో జరిగిన కార్యక్రమానికి హాజరైన న్యాయ విభాగాధిపతి, బిఒఎస్ డా. బి. స్రవంతి మాట్లాడుతూ జైలు అధికారుల ఔదార్యాన్ని కొనియాడారు. విద్యార్థుల్లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పట్ల సహానుభూతి కల్గించారని అన్నారు. విద్యార్థులలో చైతన్యం, ఉత్తేజం కలిగే విధంగా జైలు అధికారులు ఆదరణను చూపడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు నేరస్తుల పట్ల సౌహార్దాన్ని ప్రకటించారు.