కామారెడ్డి, మార్చ్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్, సుల్తాన్ నగర్, మహమ్మద్ నగర్, గునకల్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో దళిత బంధుపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకొని లబ్ధిదారులు ప్రతినెల ఆదాయం పొందాలని సూచించారు.
మిగతా లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రాక్టర్లు, ఆటోలు సొంతంగా నడిపే వ్యక్తులు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యం ఉన్న రంగాలలో తక్కువ పెట్టుబడి తో అధిక ఆదాయం వచ్చే యూనిట్లను లబ్ధిదారులను ఎంచుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. చేపల పెంపకం, పౌల్ట్రీ, డెఈరీ,కుట్టు శిక్షణ వంటి చిన్న, చిన్న వ్యాపారాలు నేర్చుకొని ఆర్థికంగా పురోగతి సాధించాలని చెప్పారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉన్నందున చేపల యూనిట్లు పెట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావాలని సూచించారు. ముగ్గురు లబ్ధిదారులు కలిసి హార్వెస్టర్, జెసిబి, రైస్ మిల్లు వంటి యూనిట్లను పెంచుకోవాలని కోరారు. వ్యవసాయ అనుబంధ యూనిట్లను నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఎంచుకొని ఆర్థికాభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు.
ఇతర ప్రాంతాల్లో యూనిట్లను పెట్టుకోవచ్చని తెలిపారు. వంద శాతం లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్‌లు తీయడం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. దళిత బందు లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకుని వాళ్లకు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవో రాజాగౌడ్, తహసిల్దార్ నారాయణ, ఎంపీడీవో పర్బన్న, క్లస్టర్ ప్రత్యేక అధికారి సంజీవరావు, డిపిఎం రమేష్ బాబు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.