నిజామాబాద్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి మరింత మెరుగైన విద్యా బోధన జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడిరచారు. ప్రభుత్వ బడులను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల వసతులతో ఆకట్టుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం కలెక్టర్ బాల్కొండ, పోచంపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మెండోరా, బుస్సాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్ నిర్మించాలని, నీటి వసతి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మన ఊరు – మన బడి కింద తొలివిడతలో ఎంపికైన జిల్లాలోని 407 పాఠశాలల్లో అన్ని రకాల వసతులు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. పైకప్పు లీకేజీలకు మరమ్మతులు చేయడంతో పాటు కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్, ప్రహరీ గోడ, విద్యుద్దీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి పాఠశాలలో తాగునీటి సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదిత పనులకు సాంకేతిక అనుమతులు మంజూరు చేస్తామని, ఏప్రిల్ మొదటి వారంలో పనులు ప్రారంభం అవుతాయని కలెక్టర్ తెలిపారు.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనుందన్నారు. దీంతో ఓ వైపు బోధనాపరమైన కొరత దూరం అవడంతో పాటు, ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి రానున్నాయని, తద్వారా మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నీ నాణ్యతతో కూడుకుని ఉండాలని, సరైన ప్రణాళికతో సుదీర్ఘ కాలం పాటు ఉపయుక్తంగా నిలిచేలా ఉండాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. ఈ సందర్భంగా మెండోరా పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, ఈ.ఈ దేవిదాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.