జిల్లా అధికారులకు కలెక్టర్‌ హెచ్చరిక

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధుల పట్ల అలసత్వ వైఖరి ప్రదర్శించే వారిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అవసరమైతే సస్పెన్షన్‌ వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. ప్రత్యేకించి నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కరాఖండీగా తేల్చి చెప్పారు.

మన ఊరు-మన బడి కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలోనూ కొంతమంది ఏ.ఈ లు నిర్లక్ష్యాన్ని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమం అయినందున అధికారులందరూ వారికి అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో, సమర్ధవంతంగా నిర్వహించాల్సిందేనని కలెక్టర్‌ పేర్కొన్నారు.

తొలివిడతలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులకు సంబందించిన అంచనా నివేదికలను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, సోషల్‌ వెల్ఫేర్‌ తదితర ఏ.ఈలకు స్పష్టమైన గడువులు విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం సాయంత్రం నాటికి కేటాయించిన లక్షణానికి అనుగుణంగా పూర్తి వివరాలతో ఎస్టిమేషన్లు అందించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ మరోమారు స్పష్టం చేశారు.

పని చేయడం కష్టం అని భావిస్తే విధుల నుండి తప్పుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడులలో చదివే నిరుపేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములయ్యే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ మనసుపెట్టి పని చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. పేద కుటుంబాల పిల్లల అభ్యున్నతికి దోహదపడే అవకాశాన్ని ఏ ఒక్కరు జారవిడుచుకోకూడదని సూచించారు. నిర్దిష్ట గడువులోపు అన్ని పనులు గ్రౌండిరగ్‌ అయ్యేలా చూడాలన్నారు. నిర్దేశించిన క్రమంలో అంచనాలను రూపొందించి సమర్పించిన వెంటనే ముప్పై లక్షల రూపాయలలోపు విలువ కలిగిన పనులకు తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

అంచనా జాబితాల పరిశీలన, అనుమతుల జారీ కోసం శనివారం నాటి నుండే కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉంటామని, అవసరమైతే జాబితాలను అక్కడే సవరించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు కూడా చేయిస్తామన్నారు. నిబంధనలను తూచ తప్పకుండ పాటిస్తూ, రోజువారీగా లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రధానంగా పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సదుపాయాలకు అవసరమైతే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని అన్నారు. అలా అని సౌకర్యాల కల్పనలో రాజీ పడకూడదని, తప్పనిసరిగా చేపట్టాల్సిన పనులను కొత్తగా నిర్మాణాలు చేయాలని సూచించారు.

తరగతి గదుల పైకప్పులు లీకేజీలు ఉండకూడదని, ఫ్లోరింగ్‌ సరిచేసుకోవాలని, చెడిపోయిన తలుపులు, కిటికీలకు మరమ్మతులు చేయాలని, మరమ్మతులకు అవకాశం లేనట్లయితే ఐరన్‌ ఫ్రేమ్‌తో ఉన్న వాటిని ఏర్పాటు చేయాలని, పక్కాగా విద్యుద్దీకరణ పనులు జరిపించాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలబాలికలకు వేర్వేరుగా నీటి వసతితో కూడిన టాయిలెట్స్‌ అందుబాటులో ఉంచాలని, పాఠశాల ఆవరణలో వర్షపు జలాలు, మురుగునీరు నిలువ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఇదిలా ఉండగా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరి ఇచ్చిన పనులను నూటికి నూరు శాతం చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాకు మెటల్‌ కాంపోనెంట్‌ కింద 20 కోట్ల రూపాయల వరకు అదనంగా నిధులు కేటాయించారని అన్నారు. వీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ కొంత మంది ఏవో కారణాలు చెబుతూ తప్పించుకునే ధోరణిని అవలంభిస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఈ నెలాఖరు లోపు అన్ని పనులు ప్రారంభమై, ఎఫ్‌టిపీలు జనరేట్‌ కావాలని, ఏ ఒక్క పని రద్దు అయినా సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

అదేవిధంగా ఇప్పటికే ప్రారంభమైన పనులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే బిల్లులు మంజూరవుతాయని, లేనిపక్షంలో బిల్లులు అందేందుకు తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. ఉపాధి పనులను విరివిగా గుర్తిస్తూ కూలీలకు విస్తృత స్థాయిలో పని కల్పించాలని అన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, జెడ్పి సిఈఓ గోవింద్‌, డీఆర్డీవో చందర్‌, డీపీవో జయసుధ, బోధన్‌ ఆర్దీవో రాజేశ్వర్‌, ఈ.ఈ దేవిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »