కామారెడ్డి, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు మన ఊరు- మన బడి కార్యక్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టనున్న పనుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మన ఊరు- మన బడి కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ వంటి పనులను చేపట్టాలని అన్నారు. పనుల అంచనాలను సిద్ధం చేసి పరిపాలన అనుమతుల కొరకు ఉపాధి హామీ పథకం సాప్ట్‌వేర్‌లో పొందుపరచాలని సూచించారు. పాఠశాలల్లో సుందరీకరణ, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పనులు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో నిర్వహించే మన ఊరు- మన బడి కార్యక్రమానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అన్నారు.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ, మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు పరిచేందుకు ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని, ఎంపికైన పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లు, త్రాగునీరు, ప్రహరీ గోడ వంటి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వివరించారు.
మొదటి విడతలో ఎంపికైన ప్రతి పాఠశాలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సిద్దమైన ప్రతిపాదనలను తక్షణమే ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా అధికారులకు సూచించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యా శాఖ అధికారి రాజు, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.