డిచ్‌పల్లి, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, ఢల్లీి చైర్మన్ ప్రొఫెసర్ జగదేష్ కుమార్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వారి వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, యూజీసీ డైరెక్టర్ డా. సిహెచ్. ఆంజనేయులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ జగదేష్ కుమార్ టీయూ వీసికి చిర పరిచితులు. నూతనంగా నియామకం పొంఫి యూజీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం ప్రకటిస్తూ పుష్పగుచ్చం, టీయూ జ్ఞాపికను బహూకరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా టీయూ వీసీ మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధి పనుల కోసం యూజీసీ గ్రాంట్స్ అడగగా 6 కోట్ల 52 లక్షల నిధులు విడుదల చేయడానికి అంగీకరించినట్లుగా తెలిపారు. వెంటనే యుజీసీ ఢల్లీి కార్యాలయంలో గల సంబంధిత అధికారులకు నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. అదే విధంగా యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదేష్ కుమార్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించినట్లు తెలిపారు.
కాన్వకేషన్ సందర్భంలోనో, మరే ఇతర ఇంటర్నేషనల్ కాంఫరెన్స్ సందర్భంలోనో వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. అకడమిక్, పరిశోధన పరమైన అభివృద్ధి విషయాలను ఆయనతో చర్చించినట్లు తెలిపారు. నానో టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్స్ గూర్చి, పరిశోధనా ప్రగతి గూర్చి విశ్లేషించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ గ్రామీణ ప్రాంత యువతకు అత్యంత ప్రాధాన్యం వహిస్తూ విద్యా, ఉపాధి కల్పించే కోర్సుల పట్ల అత్యధిక శ్రద్ధ కనబరుస్తున్నట్లు పేర్కొన్నామన్నారు. యూనివర్సిటీ పరిశోధనా రంగ విసృతి, అభివృద్ధి పనులను గూర్చి తెలుసుకొని యూజీసీ చైర్మన్ సంతోషం వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. పాఠ్యప్రణాళికలో నూతన విద్యావిధానం మార్గనిర్దేశాలను పాటించే విధంగా చర్యలు గైకొంటున్నట్లు ఆయనకు వివరించామన్నారు.