నిజామాబాద్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అవసరమైన పనులను గుర్తిస్తూ, పక్షం రోజుల్లోపు అవి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ సూచించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, విద్యా శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో మన ఊరు-మన బడి కార్యక్రమంపై సమీక్ష జరిపారు.
నిధులు అందుబాటులో ఉన్నందున తక్షణమే పనులు ప్రారంభం అయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్లను కోరారు. ముప్పై లక్షల రూపాయల వరకు విలువ చేసే పనులను ఏజెన్సీల ద్వారా వెంటనే చేపట్టవచ్చని, అంతకు పైబడి విలువ కలిగిన పనులను టెండర్ల ద్వారా చేపట్టాలని సూచించారు. కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, టాయిలెట్స్ నిర్మాణాలను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలన్నారు. డిజిటల్ తరగతుల బోధనకు అవసరమైన సామాగ్రితో పాటు ఇతర ఫర్నిచర్‌ను హైదరాబాద్ నుండి సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.
ఆయా పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వసతులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలన్నారు. సదుపాయాల మెరుగుదలకు దోహదపడే పనులను మాత్రమే కొత్తగా చేపట్టాలని, ప్రభుత్వం నిర్దేశించిన జాబితాలో అవి తప్పనిసరిగా ఉండాలన్నారు. చేపట్టిన ప్రతీ పని అర్ధాంతరంగా నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో జరగాలని సూచించారు. ఆయా పనులకు సంబంధించిన ఎస్టిమేషన్‌లను నిశితంగా పరిశీలించి, నిధులు వృధా కాకుండా చూడాలని కలెక్టర్లను కోరారు.
పనులకు అనుమతులు మంజూరు చేసే విషయంలో కలెక్టర్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం పనులకు సంబంధించి ప్రత్యేకంగా సాఫ్ట్ వెర్ రూపొందించామని, పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అందులో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన పనులు తక్షణమే ప్రారంభం అయ్యేలా చొరవ చూపాలన్నారు.
పనులకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని, ప్రతి పని నాణ్యతా ప్రమాణాలకు లోబడి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చేపట్టిన అన్ని పనులకు సంబంధించి సామాజిక తనిఖీ జరుగుతుందని, ప్రత్యేక బృందాలతో ఆడిట్ చేయిస్తారని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టే విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలబాలికలకు వేర్వేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే టాయిలెట్స్ నిర్మించాలని, ఇప్పటికే అందుబాటులో ఉన్నవాటికి అవసరమైతే మరమ్మతులు చేసి వినోయోగంలోకి తేవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, జెడ్పి సి ఈ ఓ గోవింద్, డీఆర్డీవో చందర్, ఈ.ఈ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.