నిజామాబాద్, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని క్షయ వ్యాధి నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. టీ.బీ నియంత్రణ కోసం వారు కొనసాగించిన కృషి కారణంగా జిల్లాకు జాతీయ స్థాయిలో వరుసగా రెండవ సంవత్సరం అవార్డులు లభించాయని, జిల్లాకు మంచి గుర్తింపు దక్కిందని అన్నారు.
గత ఏడాది కాంస్య పతకం లభించగా, ఈసారి మరింత ముందడుగు వేస్తూ వెండి పతకం సాధించారని అభినందించారు. ఈ మేరకు టీ.బీ విభాగం అధికారులు, సిబ్బందికి లభించిన పతకం, ప్రశంసా పత్రాలను సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్ తన చేతుల మీదుగా వారికి బహూకరించారు. ఆశా వర్కర్ల సహాయంతో ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారని, టీబీ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి నుండి శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించారని కలెక్టర్ వివరించారు.
టీబీ సోకినట్లు నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందులు అందిస్తూ, క్రమం తప్పకుండా వాటిని వాడే విధంగా పర్యవేక్షణ జరపడంతో మంచి ఫలితాలు సాధించగలిగారని అన్నారు. వీరి కృషి ఫలితంగా జిల్లాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కిందని, ఇకముందు కూడా మరింత ఉత్సాహంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.
టీబీ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న జిల్లా కో ఆర్డినేటర్ రవి గౌడ్, ల్యాబ్ టెక్నీషియన్ స్వరాజ్యలు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులను దక్కించుకున్న సందర్భంగా కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా, ప్రపచంచ క్షయ నివారణ దినోత్సవంను పురస్కరించుకుని ఈ నెల 29 న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో కార్యక్రమం నిర్వహించనున్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం తెలిపారు.