విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు – మన బడి

నిజామాబాద్‌, మార్చ్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మరింత బలోపేతం అవుతాయన్నారు. దీంతో మెరుగైన విద్యాబోధన అందుతుందన్నారు.

తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి అన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని వెల్లడిరచారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన సుమారు 60 లక్షల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ఓట్ల కోసమో, రాజకీయ లబ్ది కోసమో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26వేల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 7200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. తొలివిడతగా ఈ ఏడాది 9 వేల పై చిలుకు పాఠశాలల్లో 3,400 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 1150 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, తొలి విడతలో 407 బడులలో వసతుల కల్పన కోసం 160 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వివరించారు. తరగతి గదులు, విద్యుదీకరణ పనులు, పైకప్పు లీకేజీల మరమ్మతులు, ఫ్లోరింగ్‌, డైనింగ్‌ హాల్‌, కిచెన్‌ షెడ్‌, ప్రహరీగోడ, నీటి వసతితో కూడిన టాయిలెట్స్‌, అధునాతన ఫర్నీచర్‌ తదితర సౌకర్యాలన్నీ సమకూరుతాయన్నారు. ఈ పనులు చేపట్టే విషయంలో ఎవరి పెత్తనానికి తావులేకుండా, స్థానిక సర్పంచ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నిర్వహణ కమిటీ చైర్మన్‌, ఇంజనీరింగ్‌ విభాగం ఏఈల ద్వారా పారదర్శకంగా పనులు జరిపిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వం సమకూరుస్తున్న వసతులు, బోధనా వనరులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ఇదిలావుండగా, వచ్చే ఏప్రిల్‌ నెల నుండి కొత్త పెన్షన్లు అందించడం జరుగుతుందని, మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ మాఫీ నిధులు కూడా విడుదల చేయనుందని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు మాట్లాడుతూ, మన ఊరు – మన బడి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమం అని అన్నారు. సమాజ ప్రగతితో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరి అభివృద్ధిలో పాఠశాల విద్యనే మూలమని గుర్తు చేశారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దాతలు కూడా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, నాణ్యమైన బోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ముందుకెళ్తోందని అన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్‌ పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ఇదే కోవలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన బోధన అందించి వారి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని చెప్పారు.

జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడిన ఉప్పులూరు గ్రామం నుండి విద్యారంగంలో నూతన విప్లవం ప్రారంభం కాబోతుందన్నారు. ఈ మహా యజ్ఞానికి వేదికగా మారిన ఉప్పులూరు గ్రామం అందరికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తూ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు వృధా కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనకై వెచ్చించేలా చూడాలన్నారు.

ఇదిలా ఉండగా, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్‌ జిల్లాకు దళిత బంధు, ఉపాధి హామీ, మన ఊరు- మన బడి తదితర కార్యక్రమాలలో ఒకింత ఎక్కువ మొత్తంలోనే నిధులు మంజూరు అవుతున్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను పక్కాగా పర్యవేక్షిస్తూ, సకాలంలో పూర్తి చేయించేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని కలెక్టర్‌ కోరారు.

కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్మూర్‌ ఆర్‌డిఓ శ్రీనివాస, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, మన ఊరు మనబడి కార్యక్రమం ప్రారంభోత్సవంతో పాటు సుమారు రెండు కోట్ల రూపాయల విలువచేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు హాజరైన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డిలను ఉప్లూర్‌ గ్రామస్థులు డప్పు వాయిద్యాల నడుమ బోనాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »