ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

నిజామాబాద్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అన్నారు.

అదేవిధంగా సరిపడా ఓ.ఆర్‌.ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపర్చాలని సి.ఎస్‌. కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

దీనిపై జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి స్పందిస్తూ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని సీ ఎస్‌ దృష్టికి తెచ్చారు. జిల్లాలో వడదెబ్బతో ఏ ఒక్క ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »