వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగం రబీ సీజన్‌లో పండిరచిన వరి ధాన్యం అంతటిని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. బుధవారం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌ గౌడ్‌, డి.రాజేశ్వర్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

సమావేశం ప్రారంభమైన వెంటనే జెడ్పి చైర్మన్‌ ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావనకు తేగా, మంత్రితో పాటు జెడ్పి సభ్యులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అనంతరం జెడ్పి చైర్మన్‌ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రబీలో తెలంగాణ రైతులు సాగు చేసిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం ప్రకటించారు.

పంజాబ్‌ తరహాలోనే తెలంగాణలో సాగవుతున్న ధాన్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేద్యపు రంగానికి అందిస్తున్న తోడ్పాటుతో రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యం పండిస్తున్నారని అన్నారు. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే 2014 లో కేవలం 4 .29 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగయ్యేదని, ప్రస్తుతం దాదాపు రెట్టింపు స్థాయిలో 7 .14 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారని వివరించారు.

అనంతరం ఎజెండా అంశాలపై చర్చను చేపట్టగా, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె.గోవిందు సమావేశం దృష్టికి తెచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో సుమారు యాభై వేల ఎకరాల వరకు వరిసాగు విస్తీర్ణం తగ్గిందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు పొద్దు తిరుగుడు, నువ్వులు, ఎర్రజొన్న ఇత్యాది పంటలను సాగు చేస్తున్నారని అన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, పంట మార్పిడి దిశగా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సకాలంలో రైతులకు అందించేందుకు వీలుగా విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. అధిక లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. చేపూర్‌ వద్ద నర్సరీలో ప్రత్యేకంగా ఆయిల్‌ పామ్‌ మొక్కలు పెంచడం జరుగుతోందని, జూన్‌ మాసం నుండి రైతులకు వీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఇండియన్‌ ఆయిల్‌ పామ్‌ చట్టాన్ని అనుసరిస్తూ సంబంధిత బోర్డు మద్దతు ధరను ప్రకటిస్తూ పంటను సేకరిస్తుందని అన్నారు. మొక్కలు నాటిన నాలుగవ సంవత్సరం నుండి దిగుబడులు చేతికండం ప్రారంభం అవుతుందని, కనీసం ముప్పై సంవత్సరాల వరకు దిగుబడులు వస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటేందుకు సుమారు లక్షా 20 వేల పెట్టుబడి అవసరం అవుతుండగా, అందులో ప్రభుత్వం 72 వేల రూపాయలను సబ్సిడీ కింద సమకూరుస్తుందన్నారు. అయితే, చౌడు నేలలు, నీటి వసతి లేని చోట ఆయిల్‌ పామ్‌ సాగు సాధ్యం కాదన్నారు. ఈ విషయాలను రైతులకు తెలియజేస్తూ విరివిగా ఈ పంట సాగు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఔత్సాహికులైన జెడ్పి సభ్యులకు అధ్యయన యాత్రను ఏర్పాటు చేస్తామని, ఖమ్మం జిల్లాలో ఈ పంట సాగు విధానాన్ని పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చీపురు వద్ద నర్సరీని కూడా సందర్శించవచ్చని సూచించారు. ఇదిలా ఉండగా, ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్న సందర్భంగా కలెక్టర్‌ నారాయణరెడ్డిని, సంబంధిత అధికారులను మంత్రి అభినందించారు.

ఉపాధి హామీ కూలీలకు విరివిగా పనులు కల్పిస్తూ, ఇప్పటివరకు వారికి 82 కోట్ల రూపాయల వేతనాలను పంపిణీ చేశామని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఉపయుక్తంగా నిలిచేలా ప్రత్యేకంగా ఐదు చొప్పున అభివృద్ధి పనులను గుర్తిస్తున్నామని అన్నారు. ప్రైవేట్‌ నర్సరీ ఏర్పాటు, అప్రోచ్‌ రోడ్లు, వరద జలాల మల్లింపు వంటి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.

విద్యా శాఖపై చర్చ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్ధేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన నిధులు వృధా కాకుండా చూడాలని, పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని పేర్కొన్నారు.

జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన టీబీ నియంత్రణ విభాగం ఉత్తమ పనితీరును కనబర్చి జాతీయ స్థాయిలో గతేడాది రజత పతకం, వరుసగా ఈ ఏడాది కాంస్య పతకం సాధించడం పట్ల మంత్రి ప్రశాంత్‌ రెడ్డి డీఎంహెచ్‌ఓను అభినందించారు. కలెక్టర్‌ ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని, ప్రత్యేకించి కరోనా సమయంలో వారు చేసిన కృషి మర్చిపోలేనిది మంత్రి ప్రశంసించారు.

కాగా, పూర్తయిన కాలానికి చెందిన జిల్లా పరిషత్‌ భవనాన్ని నూతనంగా నిర్మించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయించాలని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు మంత్రిని కోరారు. జెడ్పి సర్వ సభ్య సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ రజితాయాదవ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా మండలాల జెడ్పిటీసిలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »