నిజామాబాద్, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి ఇకపై సమృద్ధిగా సాగు జలాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపాడ్ బ్యాక్ వాటర్ మళ్లింపు కోసం చేపట్టిన 21వ ప్యాకేజీ పనులు పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయని, తద్వారా బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి బెంగ శాశ్వతంగా దూరం కానున్నదని హర్షం వ్యక్తం చేశారు.
భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో చిన్నవాగుపై సుమారు కోటి 72 లక్షల రూపాలయను వెచ్చిస్తూ చేపడుతున్న రెండు చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులకు గురువారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా జాగిర్యాల్ గ్రామంలో ఉడిపి వాగు పై 84.80 లక్షలతో నిర్మించే చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, బాల్కొండ సెగ్మెంట్ లో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించాలనే తపనతో తాను ముఖ్యమంత్రిని ఒప్పించి, మెప్పించి పోచంపాడ్ జలాల మల్లింపు కోసం 21 వ ప్యాకేజి పనుల కింద 1350 కోట్ల రూపాయలను మంజూరు చేయించానని తెలిపారు.
ప్రస్తుతం ఈ పనులు పూర్తి కావచ్చాయని, దీని ద్వారా ప్రతి మూడు ఎకరాలకు ఒక బోరుబావి తరహాలో నియోజకవర్గ రైతాంగానికి సాగు నీరు అందుతుందని అన్నారు. తుది దశలో ఉన్న పైప్ లైన్ నిర్మాణ పనులకు సహకరించాలని రైతులను కోరారు. కాగా, భూగర్భ జలాలను పెంపొందించేందుకు వాగులలో అవసరమైన చోట పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ముచ్కూర్, జాగిర్యాల్ లో మూడు చెక్ డ్యామ్ లకు నిధులు మంజూరు చేయించానని వివరించారు.
సమృద్ధిగా సాగు జలాలను అందుబాటులోకి తెస్తూ, ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఫలితంగా తెలంగాణలో పంటల సాగు రెట్టింపు స్థాయికి పెరిగిందన్నారు.
ఇదిలా ఉండగా, గొల్ల కుర్మల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన గొర్రెల పంపిణి రెండవ విడత కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మండలం ముచ్కూర్ నుండి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని 47 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, గొల్ల కుర్మలకు ఆర్ధిక సాయం అందిస్తే వారి కుటుంబాలు బాగుపడడమే కాకుండా రాష్ట్ర సంపద కూడా పెరుగుతుందనే గట్టి నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణి పథకాన్ని అమల్లోకి తెచ్చారని అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అన్ని వర్గాల వారు అభివృద్ధి సాదించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే ఎలాంటి సీలింగ్ లేకుండా యాదవ కుటుంబాలన్నింటికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని అన్నారు. ఎవరి దయా దాక్షిణ్యాల కోసం పాకులాడాల్సిన అవసరం ఉండకుండా నూటికి నూరు శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. జిల్లాలో మొదటి విడత కింద 106 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ 2500 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను అందజేయగా, ప్రస్తుతం రెండవ విడతలో యూనిట్ విలువను లక్షా 75 వేలకు పెంచుతూ లబ్దిదారులకు గొర్రెలు పంపిణి చేస్తున్నామని చెప్పారు.
లబ్ధిదారుడు కేవలం 25 శాతం నిధులను తన వాటా కింద అందిస్తే, ప్రభుత్వం 75 శాతం నిధులను సమకూరుస్తుందని అన్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు ఆర్ధిక అభ్యున్నతి దిశగా ముందుకు సాగడమే కాకుండా, రాష్ట్ర సంపద పెరిగేందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.