బాన్సువాడ, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు, బోదన్ ఆర్‌డివో రాజేశ్వర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ…నియోజకవర్గంలో నాకు ప్రాధాన్యత గల అంశాలు మూడు ఉన్నాయని, ఇంటింటికీ త్రాగునీరు, గుంటగుంటకు సాగునీరు, ప్రతి పేదవారికి స్వంత ఇల్లు ఉండాలన్నారు. ప్రతి ఆడబిడ్డ తన ఇంటి దగ్గరనే మంచి నీళ్లు పట్టుకోవాలని, మిషన్ భగీరధ పథకం ద్వారా ఇప్పటికే ఇంటింటికీ త్రాగునీరు అందిస్తున్నామని, ఇంకా ఎక్కడైనా కనెక్షన్ ఇవ్వకపోతే తక్షణమే ఇవ్వాలన్నారు.
రైతులు సాగునీరు లేకపోతే వ్యవసాయం చేయలేరు కాబట్టి, గతంలో నిజాంసాగర్ ఆయకట్టులోని పొలాలు ఎండిపోకుండా ప్రభుత్వాలతో పోరాడి సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని తెచ్చి గుంట కూడా ఎండిపోనివ్వలేదని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు నిజాంసాగర్‌లోకి వస్తున్నాయన్నారు. రూ. 150 కోట్లతో నిజాంసాగర్ కాలువలను ఆధునీకరించామని, చివరి ఆయకట్టు వరకు ఉన్న డి-28 కాలువను రూ. 15 కోట్లతో లైనింగ్ చేయించామన్నారు.
రాష్ట్రంలో పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని, హంగర్గ ఫారంలో 40 ఇళ్ళను ప్రారంభించాం, మరో 35 ఇళ్ళకు శంకుస్థాపన చేశామన్నారు. నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదలందరికి స్వంత ఇంటి కల నెరవేరుస్తానని పోచారం తెలిపారు. 2 బిహెచ్‌కె లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, జాతి, పార్టీ ఎలాంటి వివక్ష లపేదవారు ఎవరైనా డబుల్ బెడ్ రూం ఇళ్ళకు అర్హులని స్పష్టం చేశారు.
లబ్ధిదారులు స్వంత స్థలంలో ఇళ్ళు నిర్మించుకోవడం ప్రారంభించింది బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోనేనని, పేదల కోసం బాన్సువాడ నియోజకవర్గంలో 80 జనరల్ ఫంక్షన్ హాల్స్ కట్టిస్తున్నామని, కేవలం నామమాత్రంగా అయిదువేల రూపాయలు చెల్లించి స్వంత గ్రామంలోనే ఫంక్షన్లు చేసుకోవచ్చన్నారు. ఆడబిడ్డల పెళ్ళికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా నగదు సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. రూ. 12,000 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో నలబై రెండు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు ఇస్తున్నారని, ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకే గ్రామంలో ఒకే రోజు 22 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం తన సర్వీసులో తొలిసారి చూస్తున్నానని అన్నారు. ఇంత పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పాలుపంచుకునే అవకాశం లభించడం సంతోషం కలిగించిందన్నారు.