నిజామాబాద్, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెరిగిన కరువు భత్యం అమలుకై పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు.
వనమాల కృష్ణ మాట్లాడుతూ 1994లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2021 జనవరి నుండి డిసెంబర్ 2021 వరకు వినిమయ ధరల పెరుగుదల సూచి 1548 పాయింట్ల నుండి 1602 పాయింట్లకు పెరిగిందన్నారు. అనగా 54 పాయింట్లు పెరిగిందన్నారు. పాయింట్‌కు పది పైసల చొప్పున కరువు భత్యం రూ.5.40 పైసలు పెరుగుతుందన్నారు.
ఈ పెరుగుదలతో పాటు మొత్తం కరువు భత్యం రూ. 138.80 పైసల బీడీ యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొత్తంగా బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.217.75 పైసలు వస్తుందన్నారు. పెరిగిన కరువు భత్యాన్ని 2022 ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని బీడీ యాజమాన్యాలను డిమాండ్ చేశారు. కరువు భత్యం అమలు కోసం బీడీ కార్మికులు, నెలసరి జీతాల ఉద్యోగులు, బీడీ ప్యాకర్లు ఆందోళనలకు సిద్ధం కావాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) పిలుపునిస్తున్నదన్నారు. విలేకరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న పాల్గొన్నారు.