కామారెడ్డి, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదో తరగతి విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత వసతి గృహంలో గురువారం షెడ్యూల్ కులాల, వెనుకబడిన తరగతుల, గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న వసతిగృహాల విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పదవ తరగతిలో జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు.
పట్టుదలతో చదివి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. వివిధ సబ్జెక్టుల నిపుణులు పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు పరీక్ష సామాగ్రి జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి అంబాజీ, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, వివిధ వసతిగృహాల సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.