దళిత బంధు అమలు చారిత్రాత్మక నిర్ణయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇదేదో రాజకీయ లబ్ది కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు సమాజంలోని వివిధ వర్గాల వారితో చర్చోపచర్చలు జరిపి ఎంతో మేధోమధనం చేసిన తరువాతనే దళితబంధు కు రూపకల్పన చేశారని తెలిపారు.

దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో వారు ఎంపిక చేసుకున్న యూనిట్ల మంజూరీ పత్రాలను, ట్రాన్స్‌ పోర్ట్‌ వాహనాలను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా పంపిణీ చేశారు. జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్త, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొని దళిత బంధు పథకం ఔన్నత్యాన్ని తమ ప్రసంగాల్లో వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, అరవై సంవత్సారాలుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో ఇంకనూ అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్తృత స్థాయిలో వివిధ వర్గాలకు చెందిన వారితో సమాలోచనలు జరిపి పక్క ప్రణాళికతో దళిత బంధు కార్యక్రమాన్ని రూపొందించారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మనసుపెట్టి ఆచరణలోకి తెచ్చిన పథకం ఇది అని పేర్కొన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు, ష్యురిటీలు, బ్యాంకు కాంసేంట్‌ లేకుండానే నేరుగా లబ్ధిదారులకు పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని అన్నారు.

లబ్ధిదారులు ఈ మొత్తాన్ని తమకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, తద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించాలన్నదే దళిత బంధు పథకం ఉద్దేశ్యమని అన్నారు. ప్రయోగాత్మకంగా తొలివిడతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి ప్రస్తుతం యూనిట్లను మంజూరు చేస్తున్నామని, వీటి స్థాపన పూర్తయిన వెంటనే మరో రెండు నెలల వ్యవధి లోపే మలి విడత కింద ఒక్కో సెగ్మెంట్‌ నుండి రెండు వేల మంది లబ్ధిదారులను దళిత బంధు కింద ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలో గల మొత్తం 56 వేల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుందని, ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా కల్పించారు. దళారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా, ఏ దశలోనూ అవినీతి, అక్రమాలకు తావు ఉండరాదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ ఎలాంటి ఆంక్షలు, పరిమితులు విధించకుండా లబ్ధిదారుల పేరిట నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేయించారని, తొలి విడత కింద జిల్లాకు 55 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే మంజూరై సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల వారి కోసం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కోవలోనే దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం ఉద్దేశించిన దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఈ పథకానికి సార్థకత చేకూర్చాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హితవు పలికారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, దళిత కుటుంబాలు తమ కాళ్ళపై తాము నిలదొక్కుకుని సమాజంలోని అన్ని వర్గాల వారితో సమానంగా ఆర్ధిక ప్రగతిని సాధించాలని, మరో పది మందికి ఉపాధి కల్పించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ విధివిధానాలను అనుసరిస్తూ ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటికే వారు కోరుకున్న రంగాల్లో వ్యాపారాలు స్థాపించేందుకు వీలుగా శిక్షణ ఇప్పించామని అన్నారు.

యూనిట్ల స్థాపన తరువాత కూడా లబ్ధిదారులకు వారు నెలకొల్పిన వ్యాపారాలు సజావుగా సాగుతూ లాభాల బాటలో పయనించేందుకు జిల్లా యంత్రాంగం తరుపున పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తామని అన్నారు. జిల్లాలో దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నామని, తద్వారా ప్రభుత్వ సంకల్పం నూటికి నూరు శాతం నెరవేరేలా కృషి చేస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీసీ సంస్థ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌, వి గంగాధర్‌ గౌడ్‌, నగర మేయర్‌ నీతూకిరణ్‌, అదనపు కలెక్టర్‌ లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌, రెడ్‌ కో చైర్మన్‌ ఎస్‌.ఏ అలీం, ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వినీత, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి శశికళ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »