సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించనున్నందున ఉద్యోగార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా, పూర్తి స్థాయిలో సన్నద్ధమై జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలన్నారు. మన విజయానికి అడ్డంకిగా ఉన్న వాటిని విషంగా భావిస్తూ, అలాంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు.

అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించవచ్చని, జీవితంలో మళ్లీమళ్లీ ఇలాంటి అవకాశం రాదని అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్‌ నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. వివిధ విభాగాల్లో తిరుగుతూ, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న ఉద్యోగార్థులను పలుకరిస్తూ, లైబ్రరీలో నెలకొని ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వస్తున్నందున స్థలం సరిపోవడం లేదని పలువురు తెలుపగా, అప్పటికప్పుడే కలెక్టర్‌ స్పందించి సమస్యను పరిష్కరించారు. జిల్లా గ్రంథాలయానికి చేరువలోనే ఉన్న రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘ భవనం హాల్‌ను లైబ్రరీకి అనుసంధానంగా వినియోగించుకునేలా ఏర్పాటు చేయించారు. అదేవిధంగా చదువుకోవడానికి లైబ్రరీకి వచ్చే వారి వాహనాలను నిలపడానికి ఇబ్బంది అవుతోందని తెలుపగా, పక్కనే ఉన్న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో పార్కింగ్‌ సదుపాయానికి అనుమతి కల్పించారు.

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో న్యాల్‌ కల్‌ రోడ్డులో గల రోటరీ భవన్‌ను ఉద్యోగార్ధుల సౌకర్యార్ధం ఉచిత రీడిరగ్‌ రూమ్‌లుగా అందుబాటులోకి తేవాలని రోటరీ ప్రతినిధులను కలెక్టర్‌ కోరగా, అందుకు వారు సంసిద్ధత తెలిపారు. మంచి నీటి వసతితో పాటు ఉద్యోగార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. చంద్రశేఖర్‌ కాలనీలో గల ప్రాంతీయ గ్రంథాలయాన్ని కూడా పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారు వినియోగించుకునేలా కావాల్సిన సదుపాయాలు, అవసరమైన సిబ్బందిని సమకూరుస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కాగా, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉందని, ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హితవు పలికారు. ఇంకనూ ఏవైనా పుస్తకాలు కావాల్సి వస్తే, వాటిని కూడా వెంటనే తెప్పిస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పెండిరగ్‌ లో ఉన్న లైబ్రరీ సెస్‌ నిధులను ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.

అభ్యర్థులు సరైన ప్రణాళికను ఏర్పర్చుకుని అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ మార్గనిర్దేశం చేశారు. ప్రాథమిక అంశాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు ప్రయత్నిచాలని సూచించారు. ప్రశ్న, జవాబుల రూపంలో కాకుండా విషయం సంగ్రహణకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు తేడాతో ఉద్యోగ అవకాశం చేజారినందుకు ఆస్కారం ఉన్నందున అకుంఠిత దీక్షతో ఇష్టపడి చదవాలని కలెక్టర్‌ సూచించారు.

ప్రతి ఒక్కరి జీవితాల్లో చిన్నచిన్న అవరోధాలు ఉండడం సహజమేనని, వాటిని అధిగమిస్తేనే విజయ తీరాలకు చేరగల్గుతారని పేర్కొన్నారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ చక్కగా చదువుకోవాలని, జిల్లా నుండి అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. కలెక్టర్‌ వెంట జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎల్‌ ఎం బి.రాజేశ్వర్‌, ఉప గ్రంథపాలకుడు ఏ.రాజిరెడ్డి, సహాయ గ్రంథపాలకుడు తారకం, రెడ్‌ క్రాస్‌ ప్రతినిధి బస ఆంజనేయులు, గ్రంథాలయ సిబ్బంది శ్రవణ్‌, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »