డిచ్‌పల్లి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్‌లో ఉదయం విద్యార్థులకు ఇచ్చే అల్పాహారం టిఫిన్‌లో కప్ప వచ్చిన ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు మరో హాస్టల్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తె.యూ వీ.సీ ప్రొ.రవీందర్ గుప్తాకు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేందర్ మాట్లాడుతూ యూనివర్సిటీ హాస్టల్లల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. తరచూ టిఫిన్, భోజనాల్లో పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థ పదార్థాలు రావడం పరిపాటిగా మారిందన్నారు. నిన్న ఉదయం టిఫిన్‌లో కప్ప రావడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హాస్టల్లో ముఖ్యంగా విద్యార్థినుల హాస్టల్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారని తరచూ ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయినప్పటికీ అధికారుల స్పందన లేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా హాస్టల్ సమస్యల ఫిర్యాదులపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ప్రస్తుతం విద్యార్థినుల సంఖ్యకు హాస్టల్ సరిపోకపోవడంతో, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మరో హాస్టల్ భవన నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త భవనం సిద్ధమయ్యేల చర్యలు తీసుకుంటామని వీ.సీ ప్రొ.రవీందర్ గుప్తా హామీ ఇచ్చారు. పి.డి.ఎస్.యు జిల్లా నాయకులు నిఖిల్, అశోక్, ప్రణయ్, నరేష్, సాయి, వంశీ, చందు పాల్గొన్నారు.