నిజామాబాద్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం టి ఎస్ ఐపాస్ ద్వారా అమలు చేస్తున్న టి ప్రైడ్ పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన వాహనాలను మంజూరు చేశారు. సోమవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలోని చాంబర్‌లో టీఎస్ ఐపాస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీ ప్రైడ్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 12 మంది ఎస్సీ లబ్ధిదారులకు, మరో 12 మంది ఎస్టీ లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన వాహనాల మంజూరుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు.
ఎస్సీ లబ్ధిదారుల్లో 11 మందికి ట్రాక్టర్ ట్రైలర్లను, ఒకరికి కారు మంజూరు చేశారు. అదేవిధంగా ఎస్టి లబ్ధిదారుల్లో ఎనిమిది మందికి ట్రాక్టర్ ట్రైలర్లు, ముగ్గురికి గూడ్స్ క్యారియర్లు, ఒకరికి ఫోర్ వీలర్ కార్ మంజూరు చేస్తూ ఈ సమావేశంలో నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశాలతో దివ్యాంగుడైన మరో దరఖాస్తుదారునికి జీవనోపాధి నిమిత్తం సబ్సిడీతో కూడిన గూడ్స్ క్యారియర్ వాహనాన్ని మంజూరు చేశారు.
టీ ప్రైడ్ పథకం కింద మంజూరైన వాహనాలకు సంబంధించి లబ్ధిదారుల్లో పురుషులకు 35 శాతం, మహిళ లబ్ధిదారులకు 45 శాతం సబ్సిడీ వర్తిస్తుందని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ బాబురావు తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.