డిచ్‌పల్లి, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో సోమవారం వైస్ ప్రిన్సిపల్ డా. ఎం. సత్యనారాయణ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావు బాఫూలే 193 వ జయంత్యుత్సవం ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు బాఫూలే ఆశయాలు, ఆదర్శాలు చాలా గొప్పవని కొనియాడారు. స్త్రీలు చదువుకుంటే సమాజమంతా వెలుగు వెదజల్లుబడుతుందని నమ్మిన క్రాంతదర్శి ఆయనని అన్నారు. దాదాపు 180 సంవత్సరాల క్రితమే తన భార్యకు చదువు నేర్పించి, బాలికా పాఠశాలను నడిపాడని అన్నారు.
నాటి అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి స్త్రీలకు విద్య నేర్పించిన చదువుల తల్లి సావిత్రీ బాయి బాఫూలేలో ఎంతో ఆత్మవిశ్వాసం నిలిపారన్నారు. ఆనాటి స్ఫూర్తియే ఈనాడు స్త్రీల విద్యా శాతం మెరుగుదల కారణమైందని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా 50 శాతం బాలికలు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. జ్యోతి రావు ఫూలే ను గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని ప్రశంసించారు.
గులాంగిరి పుస్తకాన్ని రచించిన కులమత తత్త్వ అసమానతలను తొలగించారని అన్నారు. సత్యశోధక్ సంస్థ ద్వారా ఆనాటి సమాజంలో గల అనేక మూఢ విశ్వాసాలను, బాల్యవివాహాల ఖండనను, వితంతోద్ధనరణను, స్త్రీల స్వయం శక్తి, స్వయం సమృద్ధి, ఆర్థిక స్వాలంబనను కల్పింపజేశారని అన్నారు.
కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ ఆచార్య పి. కనకయ్య మాట్లాడుతూ జ్యోతి బాఫూలే ప్రబోధనలు మానవుని వ్యక్తి నిష్ట, వికాసం, సంస్కరణ వంటివి వినిర్మాణం చేసుకోవడానికి పనికి వస్తాయన్నారు. డా. పున్నయ్య, డా. వి. త్రివేణి తదితరులు ప్రసంగించారు. అధ్యాపకులు డా. పాతనాగరాజు, డా. బాలశ్రీనివాస మూర్తి, డా. రమణాచారి, డా. అబ్దుల్ ఖవి, డా. శ్రీనివాస్ గౌడ్, యెండల ప్రదీప్, పులి జైపాల్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.