నిజామాబాద్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీ.సీల సంక్షేమమే ధ్యేయంగా జ్యోతి రావ్ పూలే అహర్నిశలు కృషి చేశారని తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బగొని అశోక్ గౌడ్ అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక్ నగర్‌లో జ్యోతి రావు పూలే 196 వ జయంతి వేడుకలను తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అశోక్ గౌడ్, సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఉట్నూర్ సత్య గౌడ్ మాట్లాడుతూ బీ.సీల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి జ్యోతి రావు పూలే అని కొనియాడారు. బీ.సీలకు ఉన్నత విద్యనందించేందుకు అహర్నిశలు కృషి చేయడమే కాకుండా అన్ని రంగాల్లో బీ.సీ లకు ప్రత్యేకతను చాటిన గొప్ప మహానుభావుడు జ్యోతి రావు పూలే అని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బీ.సీలు ఉన్నత స్థాయికి చేరే విధంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బీ.సీ సంక్షేమ సంఘం బాల్కొండ అధ్యక్షులు కత్రాజి రాజ మల్ల, రవీందర్ గౌడ్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.