నిజామాబాద్, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ కార్మికులకు వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 30 శాతం పిఆర్‌సి ప్రకటించిందన్నారు. గత 2021 జూన్ నుండి వేతన పెంపు అమలు చేస్తామని, నాటి నుండి వేతన పెంపు బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ మున్సిపల్ కార్మికులకు వేతన పెంపు బకాయిలు విడుదల కాలేదన్నారు. వెంటనే వేతన పెంపు బకాయిలను ఒకే విడతలో అందజేయాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం నియమించబడ్డ మున్సిపల్ డ్రైవర్లకు వేతన పెంపు ను అమలు చేసిన పాలక మండలి, కార్మికులకు మాత్రం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు యూనిఫాంలు, డ్రెస్సులు, చీరలు ఇచ్చిన ప్రభుత్వం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను విస్మరించడం సరైంది కాదన్నారు. వీరికి కూడా యూనిఫామ్, చీరలు, డ్రెస్సులు ఇవ్వాలన్నారు.
కార్మికులలందరికీ గుర్తింపు కార్డులు, పనిముట్లు, సబ్బు, నూనెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు కిరణ్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.