డిచ్‌పల్లి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో మంగళవారం కూడా ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ కొనసాగింది.
రెండవ రోజు వాలంటీరులందరు గ్రామంలో ‘‘బేటీ బచావో – బేటీ పడావో’’ అనే అంశంపై ర్యాలి నిర్వహించి అవగాహన కల్పించారు. వీదుల్లో తిరుగుతూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డా. మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ బయో టెక్నాలజీ విభాగాధిపతి డా. కిరణ్మయి కాసుర్ల, బాలికల హాస్టల్ వార్డెన్ జవేరియా ఉజ్మా విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. వారు ఆడపిల్ల చదువు, భవిష్యత్తుపై తప్పక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయని అన్నారు.
గ్రామాలలో ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్షతను ఖండిరచారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం నేరమని తెలియజేశారు. మూఢ విశ్వాసాల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. నేడు బాలికలు కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఒక దేశ చరిత్రను స్థిరీకరణ చేయడానికి ఆ దేశంలోని బాలికా విద్యాశాతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశించారని అన్నారు. కావున ఆడపిల్లలు భారమని అనుకోకుండా, బాగా చదివించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పారు. ఇత్యాది విషయాలను పల్లె ప్రజలకు వివరించాలని వాలంటీర్స్‌ను కోరారు.
యూనిట్ – 2 ఆధ్వర్యంలో స్పషల్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు డా. మహేందర్ రెడ్డిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ఎన్ ఎస్ ఎస్ కో- ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి ప్రతేకంగా అభినందించారు.