జిల్లా ఆసుపత్రిని సందర్శించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.

రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, మందుల స్టాక్‌ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు అవసరమైన అన్ని మందులను ఆసుపత్రిలోనే ఉచితంగా అందించాలని, బయటి నుండి తెచుకోవాల్సిందిగా సూచించకూడదని చైర్మన్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ కుసూచించారు.

ఆసుపత్రిలోని అమృత్‌ ఫార్మసీని తనిఖీ చేశారు. జనరిక్‌ మందులను తగ్గింపు ధరలతో అందించాల్సి ఉండగా, ఈ మేరకు బోర్డును సరిగా ప్రదర్శించకపోవడాన్ని గమనించిన చైర్మన్‌ శ్రీనివాస్‌ నిర్వాహకుల తీరును తప్పు బట్టారు. తప్పనిసరిగా డిస్కౌంట్‌ పై మందులు ఇచ్చే విషయాన్ని అందరికి కనిపించేలా బోర్డుపై రాయించాలని ఆదేశించారు. ఫార్మాసిస్టులు, వైద్యులు సమన్వయాన్ని పెంపొందించుకుని సాధ్యమైనంత వరకు రోగులకు ప్రభుత్వం తరపున పూర్తిగా అన్ని మందులను ఉచితంగా అందించాలని, అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, నిరుపేదలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని హితవు పలికారు.

కాగా, జిల్లా జనరల్‌ ఆసుపత్రి ఎదురుగా నిర్మించదల్చిన ఎనిమిదంతస్థులతో కూడిన మాతాశిశు విభాగం ఆసుపత్రి (ఎంసీహెచ్‌) భవన నిర్మాణం అర్ధాంతరంగానే నిలిచిపోయిందని ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం కేవలం గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్థు నిర్మాణానికి పరిమితం కావడం వల్ల గడిచిన నాలుగేళ్ల నుండి ఈ భవనం నిరుపయోగంగా ఉంటోందని అన్నారు. దీని నిర్మాణాన్ని పూర్తి చేయిస్తే నిజామాబాద్‌ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలకు కూడా మరింత మెరుగైన సేవలందేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు.

అన్నింటికీ మించి జిల్లా జనరల్‌ ఆసుపత్రి పైన ఒత్తిడి తగ్గుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 1200 పైచిలుకు అవుట్‌ పేషంట్లు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వస్తున్నారని, ఒక్కోసారి ఈ సంఖ్య 2000 వరకు కూడా ఉంటోందని అన్నారు. దీనివల్ల ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తోందని తెలిపారు. కొత్తగా మాతాశిశు విభాగం కోసం అన్ని వసతులతో కూడిన భవన నిర్మాణం ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయిస్తే నిజామాబాద్‌ సహా మరో నాలుగు జిల్లాల ప్రజలకు ఎంతో నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని అన్నారు.

కోవిడ్‌ ఉధృతి కొనసాగిన సమయంలో జిల్లా జనరల్‌ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున సేవలందించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలోనే మరే ఇతర జిల్లాలలో లేని విధంగా కోవిడ్‌ బారిన పడిన 300 మంది గర్భిణీలకు స్థానికంగానే కాన్పులు చేశారని అన్నారు. అలాగే 75 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను కూడా ఇక్కడే వైద్యం చేశారని చెప్పారు.

ప్రస్తుతం ఎంసీహెచ్‌ను అందుబాటులోకి తెస్తే ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత నాణ్యతతో అందించగలుగుతామని అన్నారు. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలు పంపాలని చైర్మన్‌ శ్రీనివాస్‌ సంబంధిత అధికారులకు సూచించారు. వీరి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ దేవేందర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »