నిజామాబాద్, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశ్రమల తరహాలోనే వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా మారాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. రైతులు మూస ధోరణిని వీడి, అభివృద్ధి చెందిన సాంకేతికతను జోడిస్తూ ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు.
ప్రధానంగా ఆదర్శ రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు తోటి రైతులకు నూతన విధానాలతో పంటలు పండిరచడంలో, అభివృద్ధి చేసిన వంగడాలను వినియోగించేలా తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రగతి భవన్‌లో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు లాభాల బాటలో పయనించేందుకు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడారు.
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థానిక జిల్లా రైతాంగం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఒక అడుగు ముందే ఉన్నారని, అధిక దిగుబడుల సాధనలోనూ నిజామాబాద్ జిల్లాదే అగ్రస్ధానంగా ఉంటోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక రైతులను సంఘటితపర్చి, సరికొత్త ఆలోచనలతో, సమిష్టి నిర్ణయాలతో సాగు రంగంలో వారు మరింత ప్రగతి సాధించేలా మనమంతా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధించేలా రైతులు కృషి చేస్తే అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. సాంప్రదాయ పద్దతులను వీడి, ఆధునిక పద్దతులను అవలంభిస్తే చాలా వరకు పంట ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవచ్చని సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక వినియోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకుంటూ సాగు రంగంలో నూతన ఒరవడిని సృష్టించాలని కలెక్టర్ సూచించారు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాల బాధ్యులు, ఆదర్శ రైతులు ఆధునిక పద్దతులను అవలంభిస్తూ,, రైతులకు స్ఫూర్తిగా నిలువాలని, జిల్లా యంత్రంగం తరపున తాము అన్ని విధాలుగా మద్దతు అందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం నాగేష్, జిల్లా వ్యవసాయ అధికారి జె.గోవింద్, కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ నవీన్, డాక్టర్ స్వామి, ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు.