నందిపేట్, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో బుధవారం తెరాస మండల నాయకులు ఎంపిపి సంతోష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి మండల పరిషత్ కార్యాలయం వద్ద పాలాభిషేకం చేసి జై కేసీఆర్ జై జీవన్ రెడ్డి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చెయ్యమని చేతులెత్తేసినప్పటికి రైతుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో వరి ధాన్యం కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
వైస్ ఎంపీపీ దేవేందర్ మాట్లాడుతూ వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రైతులకు సూచించారు. మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వరి కొనుగోలు విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేస్తుందని వాగ్దానాలు చేసి ఇప్పుడు తీరా పంట చేతికొచ్చిన సమయంలో మాట మార్చారని దుయ్యబట్టారు.
రెండు నాల్కల బండి సంజయ్ లాంటి బిజెపి నాయకులకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రైతులు ఐక్యమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉంటూ తెరాస ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్‌లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నందిపేట్ గ్రామ పంచాయతీ పాలక సభ్యులు పాల్గొన్నారు.