నిజామాబాద్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏ ఒక్క కులానికో, వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన జాతీయ నాయకుడని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులను ఒకే గొడుగు కిందకు తెస్తూ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేలా అంబేడ్కర్ రాజ్యాంగం రూపకల్పనకు చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు.
జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో అంబేడ్కర్ 131వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్త, ఆశన్నగారి జీవన్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు ముందుగా ఫులాంగ్ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ, ఎంతో ముందు చూపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని అంశాలను మేళవిస్తూ భారత రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు.
రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ను అనుసరిస్తూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఏర్పాటు అయిందని పేర్కొన్నారు. అంబేడ్కర్ మూల సిద్ధాంతమైన బోధించు, సమీకరించు, పోరాడు అనే అంశాలను తెలంగాణ ఉద్యమానికి అన్వయించుకుని, ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి వేముల పేర్కొన్నారు.
అన్నదాతలను ఆదుకునేందుకు రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేయడంతోపాటు వేలాది కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. తోడ్పాటు అవసరం అయిన వారందరికీ ప్రభుత్వం తరఫున ఆసరాగా ఉంటున్నామని అన్నారు. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నది నిర్వివాదాంశం అని అన్నారు.
ఇంకనూ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ఎస్సీలకు చేయూతనివ్వాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 10 లక్షల రూపాయలను గ్రాంట్ రూపంలో అందిస్తూ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు లోను కావలసిన అవసరం లేదన్నారు. జిల్లాలో 55 వేల దళిత కుటుంబాలు ఉండగా, వచ్చే నాలుగేళ్ల వ్యవధిలోనే దశలవారీగా అన్ని కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని భరోసా కల్పించారు.
బ్యాంకు లింకేజీలు, పైరవీలు, తిరిగి చెల్లింపులు చేయాల్సిన అవసరం వంటివి లేకుండా నేరుగా లబ్ధిదారులకు పెద్ద మొత్తంలో 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం గా అందిస్తున్న ఎంతో గొప్ప పథకం దళిత బందు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు సమాజంలోని ఇతర అన్ని వర్గాల వారి తరహాలోనే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
దళిత వర్గానికి చెందిన బాలబాలికలు మెరుగైన విద్యను అభ్యసించి ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలో 248 ఎస్సి రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఒక్క విద్యార్థి పై ఏటా లక్షా ఇరవై వేల రూపాయల నిధులను ఖర్చు చేస్తూ, కార్పొరేట్ తరహా విద్యను అందిస్తోందన్నారు. తాజాగా అన్ని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చి వేస్తూ, ఆంగ్ల మాధ్యమంలో డిజిటల్ బోధన జరిపేందుకు, మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
వైద్య రంగంలోనూ ఆధునిక సాంకేతిక వసతులను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ విభాగాలు ఉండేవి కావని, ప్రస్తుతం మండల పీహెచ్సీలలోను అవి అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఉచితంగా డయాలసిస్ సేవలు, అన్ని రకాల ఆరోగ్య పరీక్షలకు వీలుగా డయాగ్నొస్టిక్ హబ్ వంటి వాటిని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఇలా ఏ విషయంలో చేసినా, ఏ రంగం పరిశీలించినా అంబేద్కర్ ఆలోచనా విధానాలు, సిద్ధాంతాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలు వాస్తవాలను గ్రహించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఎంతో గొప్పదని కొనియాడారు. స్వాతంత్రం అనంతరం ప్రత్యేక దేశంగా అవతరించిన పాకిస్తాన్‌లో తరుచూ ప్రధానిని పదవి నుండి బలవంతంగా దించేసి, సైనిక పాలన తెరపైకి వస్తుందన్నారు. మన దేశంలో మాత్రం రాజ్యాంగంను అనుసరిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు సుస్థిర పాలన సాగిస్తాయని గుర్తు చేశారు. ప్రజలు తమను తాము పాలించుకునే హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించారని అన్నారు.
రాబోయే వంద సంవత్సరాల గురించి ముందుగానే ఆలోచనలు చేసి అన్ని అంశాలను పొందుపరుస్తూ అందరికీ హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కలెక్టర్ కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సమాజంలో ఇంకా అట్టడుగున ఉన్న అనేకమందికి రాజ్యాంగ ఫలాలు అందేలా కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని మనమంతా సమిష్టిగా పని చేస్తూ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుదామని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎస్సి స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పలువురిని ఘనంగా సన్మానించారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న ఎనిమిది జంటలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, రెడ్ కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ మోహన్, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిని శశికళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, దళిత సంఘాల ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.