నిజామాబాద్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 50 వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో విప్లవ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడారు.
దేశంలోని పీడిత ప్రజల పక్షపాతిగా, మనుధర్మ భావజాలానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాంతం పోరాడాడన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాద గుండాల, అరాచక శక్తులకు వ్యతిరేకంగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని కామ్రేడ్ జార్జి రెడ్డి నిర్మించాడన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, కామ్రేడ్ జార్జిరెడ్డి దోపిడీ పీడనలు, అసమానతలు, వివక్షతలు లేని సమాజం కాంక్షించారన్నారు.
ప్రస్తుతం దేశప్రజలకు మతోన్మాదం ప్రధాన శత్రువుగా మారిందన్నారు. దేశ ప్రజలను విభజించి, పాలించేల కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నాదన్నారు. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ మతోన్మాద, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి, బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. అదే బి.ఆర్ అంబేద్కర్, కామ్రేడ్ జార్జిరెడ్డిలకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల బాధ్యులు ఆల్గోట్ రవీందర్, గోదావరి, కే.సంధ్యారాణి, సిహెచ్ కల్పన, సాయగౌడ్, డి.రాజేశ్వర్, బి.మల్లేష్, భాగ్య, నవీన్, వేణు, చరణ్, శ్యామ్, అజయ్, సాయిరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.