డిచ్‌పల్లి, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. భీం రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు.
కార్యక్రమంలో డా. ఎం. బి. భ్రమరాంబిక మాట్లాడుతూ దీన జనోద్ధారకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. సామజిక న్యాయం, సమ సమాజం, మహిళా సాధికారతకు బాటలు వేశారని అన్నారు. కులనిర్మూలన రచన ద్వారా కుల మత రహిత సమాజాన్ని కాంక్షించారని అన్నారు. దేశంలో అంటరాని తనం, అస్పృశ్యత సమూలంగా నిర్మూలించబడినప్పుడే అసలైన స్వాతంత్య్ర మూలాలు అందరికి చేరువవుతాయనే ఆశాభావం వ్యక్తం చేసేవారని అన్నారు.
నాడు దేశంలో 15 శాతం మాత్రమే ఓటు హక్కు ఉండేదని శూద్రులకు, దళితులకు, మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదని అన్నారు. కాని భారత రాజ్యాంగ రచన ద్వారా ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించిన ఘనమైన చరిత్ర బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నిటిని అట్టడుగు వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్స్ చట్టాన్ని రూపొందించారని అన్నారు. సంక్లిష్టమైన పరిస్థితులెన్నింటినో అధిగమించి ముందు తరాలకు బంగారు బాట వేసిన అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని విద్యార్థులందరు కలిగి ఉండాని ఆమె కోరారు.
కార్యక్రమంలో పిజికల్ ఎడ్యూకేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) పిడి డా.బి.ఆర్. నేతా, విద్యార్థులు పాల్గొని పాటలు పాడి ప్రసంగించారు.