కామారెడ్డి, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రజలు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గురువారం డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ జయంతి వేడుకలు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. పట్టుదలతో చదివి ఉద్యోగాలను సాధించాలని సూచించారు. అధికారులు నిస్వార్థంగా సేవలు అందిస్తే ప్రజల మన్ననలను పొందుతారని పేర్కొన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి స్టడీ సర్కిల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. విద్య నేర్చుకున్న వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. సమాజంలో జరిగే అసమానతలు రూపుమాపేందుకు ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు పాడారు. రెడ్డి పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల విజేతలకు ధ్రువీకరణ పత్రాలు, బహుమతులను అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, జిల్లా తెరాస అధ్యక్షుడు ముజిబోద్ధిన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియా, కౌన్సిలర్ అనూష, ఎంపీపీలు ఆంజనేయులు, బాలమణి, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు కొత్తపల్లి మల్లయ్య, డాక్టర్ రమేష్ బాబు, సిద్ధిరాములు, సంపత్ కుమార్, శ్రీశైలం, నరసయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.