వేల్పూర్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లాను మళ్లీ అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గత సీజన్‌లో ధాన్యం సేకరణలో నిజామాబాద్ మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ, తన రికార్డును కాపాడుకోవాలని కోరారు.
రబీలో రైతులు పండిరచిన ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో జిల్లాలో మొట్టమొదటగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన వేల్పూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన నెలన్నర రోజుల నుండి ధాన్యం సేకరణ విషయమై తీవ్ర సందిగ్ధత కొనసాగిందని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ధాన్యం మర పట్టిస్తే పెద్ద మొత్తంలో వచ్చే నూకల వల్ల సుమారు 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లనుండగా, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ రైతాంగానికి ఎంతో ఊరట కలిగించే అంశమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతాంగం పట్ల ప్రేమతో ఆర్ద్రతతో తమ ప్రభుత్వం వారి సంక్షేమ అభివృద్ధి కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.
రైతుబంధు పథకం కింద సాలీనా 17 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని, సేద్యానికి ఉచిత విద్యుత్ కోసం సబ్సిడీ రూపంలో ప్రభుత్వంపై 12 వేల కోట్ల రూపాయల భారం పడుతోందన్నారు. సాగునీటి సమస్యను దూరం చేసేందుకు వేలాది కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతోందని గుర్తుచేశారు. ప్రభుత్వ తోడ్పాటు వల్ల తెలంగాణ రైతాంగం రెట్టింపు స్థాయిలో వరి పంటను పండిస్తోందన్నారు. రైతులు పండిరచిన పంటను సేకరించేందుకు కేంద్రం ముందుకు రాని పరిస్థితుల్లోనూ రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ధాన్యం సేకరణకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
ఈ మేరకు జిల్లాలో 458 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన 1960 రూపాయల మద్దతు ధరను పూర్తి స్థాయిలో పొందాలని హితవు పలికారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చినప్పటికీ ఎక్కడైనా ఎవరైనా కడ్తా పేరుతో తరుగు అమలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అలాంటి రైస్ మిల్లులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, డిసిఓ సింహాచలం, వేల్పూర్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.