నిజామాబాద్, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ కాన్పు అయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ కావాలనే సీజీరియన్ ఆపరేషన్ చేశారని తరుచూ తమకు ఫిర్యాదులు వస్తుంటాయని, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా నార్మల్ డెలివరీలు చేసేందుకు వైద్యులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సిజీరియన్ ఆపరేషన్ వద్దు – సాధారణ కాన్పు ముద్దు అనే అంశం పై ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
సిజీరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వైద్యాధికారులు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో సిజీరియన్ కాన్పులు, అందులోను ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లలో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. దీనికి గల కారణాలు ఏవైనప్పటికీ, సీజీరియన్ ఆపరేషన్లను తగ్గిస్తూ, సాధారణ ప్రసవాల కోసం వైద్యులు నిబద్దతతో కృషి చేయాలన్నారు. అవసరం లేకపోయినా సిజీరియన్ చేశారనే అపప్రధ రాకుండా చూసుకోవాలని, అప్పుడే ప్రజల్లో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సేవల పట్ల నెలకొని ఉన్న దురభిప్రాయాలు పూర్తిగా దూరమవుతాయని పేర్కొన్నారు.
దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 61 శాతం సిజీరియన్ ఆపరేషన్లు జరుగుతుండగా, రాష్ట్ర సగటు కంటే మరెంతో ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో సిజీరియన్ ద్వారా కాన్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ, తప్పనిసరిగా అవసరం అని నిర్ధారణ అయిన పక్షంలోనే సిజీరియన్ కాన్పులు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడిన దృష్ట్యా రిస్క్ తో కూడిన కాన్పులు సైతం చేయాలన్నారు. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రతి కాన్పును నిశితంగా పరిశీలన చేయాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ రaాన్సీ, జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధలను కలెక్టర్ ఆదేశించారు.
‘‘మధ్యవర్తి’’ వ్యవస్థకు చరమగీతం పాడాలి : కలెక్టర్
ఇదిలా ఉండగా, జిల్లాలో వైద్య రంగంలో అంతకంతకు వేళ్లూనుకుంటున్న మధ్యవర్తి వ్యవస్థకు చరమగీతం పాడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యులకు పిలుపునిచ్చారు. వైద్యులు అంటే సమాజంలో ఇదివరకు ఎంతో గౌరవం ఉండేదని, ఇప్పుడు వైద్యుల పనితీరు పట్ల ప్రజలు అనుమానపడే పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అయ్యిందో ఆలోచించుకోవాలని అన్నారు. ఎంతో కష్టపడి చదివి వైద్య వృత్తిని అభ్యసించి, తమ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యుల శ్రమను కొంతమంది మధ్యవర్తులు లాక్కుంటున్నారని, ఈ వ్యవస్థ కారణంగా సాధారణ రోగులు కూడా నష్టపోవాల్సి వస్తోందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరి జోక్యం లేకుండా చికిత్స కోసం రోగి, వారి కుటుంబీకులు నేరుగా వైద్యులను సంప్రదించే వాతావరణం నెలకొనాలన్నారు. వైద్య రంగాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న మధ్యవర్తి వ్యవస్థను పారద్రోలడంలో నిజామాబాద్ జిల్లా నాందిగా నిలువాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ దిశగా వైద్యులు ముందుకు వస్తే జిల్లా యంత్రంగం తరపున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అంతకుముందు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ, సిజీరియన్ కాన్పులు తగ్గించాలని, సాధారణ కాన్పుల శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. సంబంధిత శాఖ మంత్రి హరీష్ రావు ప్రతి నెల ఈ విషయమై సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. 2021 -2022 ఆర్ధిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 27240 ప్రసవాలు జరుగగా, వాటిలో కేవలం 6483 మాత్రమే సాధారణ కాన్పులు అయ్యాయని వివరించారు. అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధికంగా 4986 నార్మల్ డెలివరీ లు జరిగాయని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం 1497 మాత్రమే అయ్యాయని అన్నారు.
సిజీరియన్ ఆపరేషన్లు 20957 జరుగగా, వాటిలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో 13922 , ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7035 జరిగాయని వివరించారు. సగటున ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90 శాతం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 శాతం సిజీరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని గణాంకాలతో సహా వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిజీరియన్ ఆపరేషన్లు తగ్గిస్తూ, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా తాము ఎలాంటి పరిస్థితుల్లో సిజీరియన్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోందన్న విషయాలను సీనియర్ గైనకాలజిస్టులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుభాష్, వైద్యులు వెంకటేష్, మధుమిత, నీలిమ, రమాదేవి, కవితారెడ్డి, భానుశ్రీ, నీలి రాంచందర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.